అనాజ్పూర్లో దారుణం… భార్యను గొడ్డలితో నరికి, పసికందును సంపులో పడేసి

భార్యను గొడ్డలితో నరికి, మూడు నెలల పసికందును సంపులో పడేసి హత మార్చిన ఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అనాజ్పూర్ బుధవారం జరిగింది.

అబ్దుల్లాపూర్మెట్ :

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అనాజ్పూర్లో దారుణం చోటు చేసుకుంది. భర్త తన భార్యను గొడ్డలితో నరికి చంపి, 3 నెలల కుమారుడిని నీటి సంపులో పడవేసి హతమార్చాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బండరావిరాలకు చెందిన లావణ్యకు అనాజ్ పూర్ కి చెందిన ధనరాజ్తో నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. బాలింతగా ఉన్న లావణ్య(23) ను బుధవారం మధ్యాహ్నం తన పుట్టింటి నుంచి నిద్ర చేయడం కోసం భర్త ధనరాజ్ తీసుకొచ్చాడు. ఇంటికి వచ్చిన కాసేపటికే భార్యతో గొడవపడిన ధనరాజ్ ఆమెను గొడ్డలితో నరికి చంపాడు.

ఆ తర్వాత 3 నెలల కుమారుడిని సంపులో పడేసి హతమార్చాడు. తల్లితో గొడవకు దిగిన తండ్రిని చూసి భయపడిన మూడేళ్ల కుమార్తె ఆద్య ఇంటి నుంచి పారిపోయి ప్రాణాలు దక్కించుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కుటుంబ కలహాలతోనే ధనరాజ్ హత్య చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. నిందితుడు పరారీలో ఉన్నాడని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు తెలిపారు.