నీటి కోసం వెళ్లి శవమయ్యాడు… డ్రమ్ములో పడి మూడేళ్ల బాలుడు మృతి

తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నీరున్న డ్రమ్ములో పడి మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ దుర్ఘటన నాగర్ కర్నూల్ తెలకపల్లి మండలం కారువంగ గ్రామంలో జరిగింది.

తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నీరున్న డ్రమ్ములో పడి మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ దుర్ఘటన నాగర్ కర్నూల్ తెలకపల్లి మండలం కారువంగ గ్రామంలో జరిగింది. నీటితో నిండిన డ్రమ్ములో పడి చిన్నారి మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లో ఎవరు లేని సమయంలో నిఖిల్(3) అనే బాలుడు బాత్రూంలోని నీటి డ్రమ్ము వద్దకు వెళ్లాడు. నీళ్లు ముంచుకోవడానికి ప్రయత్నించాడు. ఈ సమయంలో నీరు అందకపోవడంతో పక్కనే ఉన్న చిన్న బకెట్ ను బోర్లా వేసి ఆ బకెట్ పైకి ఎక్కి నీళ్లు తోడే ప్రయత్నం చేశాడు. నీరు తీసే క్రమంలో బకెట్ పైనుంచి జారీ.. డ్రమ్ములో పడ్డాడు. అనంతరం ఊపిరాడక డ్రమ్ములోనే తనువుచాలించాడు.

ఆ తర్వాత బాలుడు కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు కంగారు పడ్డారు. చుట్టుపక్కల ప్రాంతంలో వెతికినా ఫలితం లేకుండా పోయింది. చివరగా బాత్రూంలో చూడగా నీటి డ్రమ్ములో బాలుడు శవమై కనిపించాడు. కన్న కొడకును విగత జీవిగా చూసిన ఆ తల్లి గుండె పగిలేలా విలపించింది. ఈ సంఘటనతో కారువంగ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

కాగా.. వేసవి కాలం కావడంతో చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఉంటుంది. చాలా మంది డ్రమ్ముల్లో నీరు నింపుకుని ఉంచుకుంటారు. అలాంటి వారు.. ఇప్పటికైనా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.