ప్రవీణ్‌ పెన్‌డ్రైవ్‌లో మరో 3 ప్రశ్నపత్రాలు… గుర్తించిన FSL అధికారులు

ప్రవీణ్‌ పెన్‌డ్రైవ్‌లో మరో 3 ప్రశ్నపత్రాలు… గుర్తించిన ఎఫ్ఎస్‌ఎల్‌ అధికారులు…

హైదరాబాద్‌ :

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో సిట్‌ దర్యాప్తు కొనసాగుతోంది. ఏఈ ప్రశ్నపత్రం మాత్రమే లీకైందని గుర్తించిన టీఎస్‌పీఎస్సీ అధికారులు మార్చి 5న జరిగిన అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ) పరీక్షను రద్దు చేసినట్టు ఇప్పటికే ప్రకటించారు..

కానీ, ప్రవీణ్‌ దగ్గర ఉన్న పెన్‌ డ్రైవ్‌లో ఏఈ ప్రశ్నపత్రంతో పాటు టౌన్‌ప్లానింగ్‌, వెటర్నరీ అసిస్టెంట్‌, గ్రౌండ్‌ వాటర్‌ డిపార్ట్‌మెంట్‌ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలు కూడా ఉన్నట్టు సిట్‌ అధికారులు అనుమానించారు. దీంతో ప్రవీణ్‌ వద్ద ఉన్న సెల్‌ఫోన్‌తో పాటు పెన్‌డ్రైవ్‌ను సిట్‌ అధికారులు స్వాధీనం చేసుకుని ఎఫ్ఎస్‌ఎల్‌కు పంపించారు..

వాటిని విశ్లేషించిన ఎఫ్ఎస్‌ఎల్‌ అధికారులు ప్రవీణ్‌ పెన్‌ డ్రైవ్‌లో మరి కొన్ని ప్రశ్నపత్రాలు గుర్తించినట్టు సమాచారం. వెటర్నరీ అసిస్టెంట్‌, టౌన్‌ ప్లానింగ్‌, గ్రౌండ్‌ వాటర్‌ డిపార్ట్‌మెంట్‌ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలు పెన్‌డ్రైవ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, దీనిపై టీఎస్‌పీఎస్సీ అధికారులు కానీ, సిట్‌ అధికారులు కానీ ఇప్పటి వరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో ఉన్నందున ఎలాంటి వివరాలు వెల్లడించినా నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంటుందని, సమాచారం వెల్లడించడం సాధ్యం కాదని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 9మంది నిందితులను అరెస్టు చేసి కస్టడీకి తరలించారు. నిందితులను పోలీసు కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని చెబుతున్నారు. నిందితుడు ప్రవీణ్‌ ఏఈ ప్రశ్నపత్రం రేణుకకు విక్రయించగా.. మిగిలిన ప్రశ్నపత్రాలు ఎవరికి విక్రయించాడనే దానిపై సిట్‌ అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు..