KTRను బర్తరఫ్ కాదు… చంచల్ గూడ జైలులో పెట్టాలి…
కామారెడ్డి :
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదివారం కామారెడ్డి జిల్లా, గాంధారిలో ఒక్కరోజు నిరుద్యోగ నిరహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2015 నుంచి ఇప్పటి వరకు జరిగిన టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీలో కొందరికి లబ్ధి జరిగిందన్నారు. మంత్రి కేటీఆర్ ను బర్తరఫ్ చేయడమేకాకుండా.. చంచల్ గూడ జైలులో పెట్టాలని డిమాండ్ చేశారు.
సీఎం కేసీఆర్ కు కేటీఆర్ షాడో ముఖ్యమంత్రి అయితే.. కేటీఆర్‌కు షాడో మంత్రి ఆయన పీఏ అని, ఈ కథ నడిపింది మొత్తం కేటీఆర్ పీఏ తిరుపతియేనని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కేటీఆర్ మంత్రి కార్యాలయమే అన్ని వ్యవహారాలు నడిపిందని, ఏ విచారణ జరిపినా కేటీఆర్ పేషీ నుంచే మూలాలు బయటపడుతున్నాయని రేవంత్ వ్యాఖ్యానించారు.
రాజశేఖర్, కేటీఆర్ పీఏ తిరుపతి ఊర్లు పక్కపక్కనే ఉన్నాయని, కేటీఆర్ పీఏ, రాజశేఖర్ల సన్నిహితులకు అత్యధిక మార్కులు వచ్చాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. గ్రూప్-1లో 100కు పైగా మార్కులు వచ్చిన అందరి వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ పీఏ తిరుపతి సూచన మేరకే.. రాజశేఖర్‌కు టీఎస్పీఎస్సీలో ఉద్యోగం ఇచ్చారన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పించి రాజశేఖర్‌ను టీఎస్పీఎస్సీకి పంపించారన్నారు. టీఎస్పీఎస్సీలో పనిచేస్తూ పోటీ పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవుతారని ప్రశ్నించారు. గతంలో టీఎస్పీఎస్సీలో పనిచేస్తూ గ్రూప్ 1 పరీక్ష రాసిన.. మాధురికి ఒకటవ ర్యాంక్, రజనీకాంత్‌కు 4వ ర్యాంకులు వచ్చాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు..