కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా అంటే.. కేసీఆర్ జోక్ ఇన్ ఇండియా అంటూ అపహేళన చేస్తున్నారని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ అభ్యర్థిని గెలిపించినందుకు ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు కిషన్‌రెడ్డి తెలిపారు.
ప్రజలు బీజేపీ ద్వారా మార్పు వస్తుందని భావించడానికి.. ఈ ఎన్నికల ఫలితమే నిదర్శనమని స్పష్టం చేశారు. ఆత్మనిర్భర భారత్‌లో భాగంగా టెక్స్‌టైల్స్ రంగంలో తెలంగాణకు మెగా టెక్స్‌టైల్స్ పార్కును కేంద్రం కేటాయించిందని కేంద్రమంత్రి తెలిపారు. వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్కును పెట్టాలనే ఒక ఆలోచన ఉందని తెలిపారు. టెక్స్‌టైల్స్ రంగాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రధానమంత్రి పీఎం మిత్ర పథకం ద్వారా తయారీ సంస్థలను నెలకొల్పుతున్నారని వివరించారు. ఇప్పటికే ఈ పీఎం మిత్ర పథకానికి రూ.4,445కోట్లు కేటాయించారన్నారు. ఒక్కో టెక్స్‌టైల్ పార్కుకు కనీసం 1000 ఎకరాల స్థలం అవసరమవుతుందని ఆనాడు చెప్పామన్నారు. ఈ విషయంపై తెలంగాణలో పార్కును ఏర్పాటు చేసేందుకు స్థలం విషయంలో సీఎం కేసీఆర్‌కు లేఖ రాశానని కిషన్‌రెడ్డి తెలిపారు.
ఈ పార్కు వల్ల ప్రత్యక్షంగా లక్ష మందికీ.. పరోక్షంగా రెండు లక్షల మందికి ఉపాధి దొరుకుందని వెల్లడించారు. ఇప్పటికే పలు దేశాలతో టెక్స్‌టైల్ ఉత్పత్తుల ఎగుమతుల అంశంపై ఒప్పందం కుదుర్చుకున్నామని కిషన్‌రెడ్డి ప్రకటించారు. బీజేపీ మేక్ ఇన్ ఇండియా అంటే కేసీఆర్ మాత్రం జోకిన్ ఇన్ ఇండియా అంటున్నారని మండిపడ్డారు. మోదీ మేక్ ఇన్ ఇండియా కింద తీసుకోవాలి తప్పితే.. కల్వకుంట్ల జోకిన్ ఇండియాగా తీసుకోవద్దని హెచ్చరించారు.
హైదరాబాద్ నుంచి తిరుపతికి మరో వందేభారత్ రైలు: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను పునర్ నిర్మించేందుకు రూ. 720 కోట్లను కేటాయించామని.. వచ్చే నెలలో ప్రధానమంత్రి వచ్చి నూతన భవనాలకు శంకుస్థాపన చేస్తారన్నారు. వందేభారత్ రైళ్లను సీఎం కేసీఆర్ పరిహాసం చేస్తున్నారని మండి పడ్డారు. త్వరలోనే హైదరాబాద్ నుంచి తిరుపతికి మరో వందేభారత్ రైలును ప్రారంభించనున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు.
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీలో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. అబద్ధాల మీద ప్రభుత్వాన్ని నడుపుతోంది కల్వకుంట్ల కుటుంబమని వివరించారు. దిల్లీ మద్యం కేసులో కేంద్రమే ఏదో తప్పు జరుగుతుందని సీబీఐ విచారణకు ఆదేశించిందని తెలిపారు. ఒక కుటుంబాన్ని లక్ష్యంగా చేయాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని కిషన్‌రెడ్డి తెలిపారు. ఏదో కొంపలు మునిగిపోయినట్లు కవిత విచారణ సందర్భంగా మంత్రివర్గమంతా దిల్లీ వెళ్లిందని విమర్శలు గుప్పించారు.