రంజాన్ ఏర్పాట్ల పై మంత్రి కొప్పుల ఉన్నత స్థాయి సమీక్ష

రంజాన్ ఏర్పాట్ల పై మంత్రి కొప్పుల ఉన్నత స్థాయి సమీక్ష

ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా జరుపుకొనే రంజాన్‌కు ప్రభుత్వ పరంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని రాష్ట్ర ఎస్సి, మైనారిటీ సంక్షేమ శాఖా కొప్పుల ఈశ్వర్ స్ప‌ష్టం చేశారు. సోమవారం వారం మాసాబ్ ట్యాంక్‌లోని డిఎస్ఎస్ భవనంలో హోంమంత్రి మహమూద్ అలీ, కార్మిక శాఖా మంత్రి మల్లారెడ్డి,వివిధ శాఖ‌ల అధికారుల‌తో క‌లిసి రంజాన్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని పండుగలను ప్రజలు సంతోషంగా జరుపుకుంటున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని పండుగ‌ల నిర్వ‌హ‌ణ‌కు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుందని చెప్పారు. అందులో భాగంగానే ప్రతి సంవత్సరం రంజాన్‌కు ముస్లీం సోదరులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఈ సంవత్సరం కూడా రంజాన్‌కు అన్ని ఏర్పాట్లను చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. రంజాన్ నేపథ్యంలో నెల రోజులపాటు ఉపవాసదీక్షలు చేపడతారని తెలిపారు. మసీదుల వద్ద రోడ్ల మరమ్మతులు, పరిసరాల పరిశుభ్రత, లైటింగ్ వంటి అవసరమైన అభివృద్ధి పనులను చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఆటంకాలు లేకుండా నీటి సరఫరా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించారు.. రంజాన్ ముగిసే వరకు ప్రతి రోజు మసీదులలో ఇఫ్తార్ విందులు నిర్వహిస్తుంటారని, వ్యర్ధాలను వేసేందుకు ప్రత్యేక డస్ట్ బిన్‌ల‌ను ఏర్పాటు చేయాలని, ఆ వ్యర్ధాలను తరలించే విధంగా పర్యవేక్షణ జరపాలని శానిటేషన్ అధికారులను మంత్రి ఆదేశించారు.
ఈ సమావేశంలో ఎంఐఎమ్ ఎమ్మెల్యే లు జాఫర్ హుస్సేన్, బాలాల, పాషా ఖాద్రి, ముంతాజ్,ఎమ్మెల్సీ జాఫ్రి, ప్రభుత్వ సలహా దారు ఏ కే ఖాన్,మైనారిటీ శాఖా ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మసి ఉల్లాఖాన్, హజ్ కమిటీ చైర్మన్ సలీం, నగర పోలీస్ కమిషనర్ సీ వీ. ఆనంద్, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, ఎలక్ట్రికల్, శానిటేషన్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.