జాగింగ్‌ చేస్తుండగా టెక్‌ CEOను ఢీ కొట్టిన కారు… అక్కడికక్కడే

ముంబైలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక ప్రైవేట్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ‘రాజలక్ష్మి విజయ్ రామకృష్ణన్’ ఆదివారం ఉదయం మరణించారు. వర్లీ సముద్ర తీరంలో ఆమె జాగింగ్ చేస్తుండగా కారు ఆమెను ఢీకొట్టడం వల్ల మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

ఆల్ట్రుయిస్ట్ టెక్నాలజీస్ బాస్ రాజలక్ష్మి విజయ్ ఆరోగ్యం పట్ల ఎప్పుడు శ్రద్ధ వహిస్తూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ప్రతి రోజూ జాగింగ్ చేస్తూ ఉండే రాజలక్ష్మి 2023 టాటా ముంబయి మారథాన్ పూర్తి చేసింది. అయితే నిన్న అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో మరణించడం కుటుంబసభ్యులను ఒక్కసారిగా శోకసంద్రంలో ముంచేసింది.

జాగింగ్ చేస్తున్న సమయంలో కారు వేగంగా వచ్చి ఆమెను ఢీ కొట్టడం వల్ల తలకు తీవ్రంగా గాయాలయ్యాయి, దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడు మద్యం మత్తులో ఈ పని చేసి ఉండవచ్చని పొలిసులు భావిస్తున్నారు. ఒక టెక్ కంపెనీ సీఈఓ చనిపోవడంతో ముంబయి టెక్ పరిశ్రమలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

రాజలక్ష్మి విజయ్ రామకృష్ణన్ మృతికి కారణమైన డ్రైవర్ సుమెర్ ధర్మేష్ మర్చంట్‌గా గుర్తించారు, ఇప్పటికే అతని మీద వివిధ కేసులు నమోదైనట్లు పోలీసుల విచారణలో తేలింది. అంతే కాకుండా అతడు ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలో పని చేస్తున్నట్లు, తన ఇంట్లో పార్టీ జరిగిన తరువాత తన ఫ్రెండ్‌తో కలిసి మహిళా సహోద్యోగిని ఇంటి దగ్గర డ్రాప్ చేసేందుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. దీనిపైన ఇంకా సమగ్రమైన విచారణ జరుగుతోంది.