రిజిస్ట్రేషన్‌ చేయకుంటే పెట్రోల్‌ పోస్తాం… పోలీసుల సాక్షిగా మహిళా తహసీల్దార్‌కు బెందిరింపులు

వరంగల్‌ :

‘భూమి రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు స్లాట్‌ బుక్‌ చేసుకున్నాం.. రిజిస్ట్రేషన్‌ చేయండి.. లేదంటే నీపై పెట్రోల్‌పోసి చంపుతాం’ అని పోలీసుల సాక్షిగా కొందరు తహసీల్దార్‌ను బెదిరించారు. ఈ సంఘటన వరంగల్‌ జిల్లా నల్లబెల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో సోమవారం జరిగింది.

బాధిత తహసీల్దార్‌ దూలం మంజుల తెలిపిన వివరాల ప్రకారం…..

మండలంలోని బిల్‌నాయక్‌తండాకు గుగులోత్‌ పద్మ అనే మహిళ భూమి రిజిస్ట్రేషన్‌ చేయాలని స్లాట్‌ బుక్‌ చేసుకుంది. ఈ భూమిపై బ్యాంకు లోన్‌ తీసుకున్నట్లు గుర్తించారు. అంతే కాకుండా పేపర్లు సక్రమంగా లేకపోవడంతో రిజిస్ట్రేషన్‌ చేసేందుకు నిరాకరిస్తూ బ్యాంక్‌ నుంచి నోడ్యూస్‌ సర్ఠిఫికెట్‌ తీసుకురావాలని సూచించారు.

ఈ విషయాన్ని పద్మ వారి కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో బిల్‌నాయక్‌తండాకు చెందిన కొందరు వ్యక్తులు సోమవారం సాయంత్రం తహసీల్దార్‌ కార్యాలయంలోకి ప్రవేశించి ‘స్లాట్‌ బుక్‌ చేసుకున్నాం..రిజిస్ట్రేషన్‌ చేయండి.. నోడ్యూస్‌ ఎందుకు తీసుకురావాలి’అంటూ నిలదీశారు. వెంటనే ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కార్యాలయానికి చేరుకోగా, వారి ముందే రిజిస్ట్రేషన్‌ చేయకపోతే నీపై పెట్రోల్‌ పోసి చంపేస్తామని తహసీల్దార్‌ను నానా దుర్భాషలాడారు. నల్లబెల్లి నుంచి నువ్వు స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని, లేకుంటే నిన్ను చంపి జైలుకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని భయభ్రాంతులకు గురిచేసినట్లు తహసీల్దార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆమె తెలిపారు.