ఉగాది ప్రాశస్త్యం ఏమిటి…?
ఉగాది అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది పచ్చడి, పంచాంగ శ్రవణం. హిందువులు జరుపుకునే పండుగలలో ఉగాది ఒకటి. దీనికి మరోపేరు ఉగస్య. ఉగ అంటే నక్షత్ర గమనం, జన్మ ఆయుష్షు అనే అర్థాలు. ఆది అనగా మొదలు ఉగాది. అనగా ప్రపంచం జన్మ ఆయుష్షులకు మొదటిరోజు ఉగాది అయింది. మరొక విధంగా, యుగం అంటే రెండు లేక జంట అని అర్థం. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాది అయింది. అదే సంవత్సరాది ఉగాది.
పురాణాల ప్రకారం…
హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మ దేవుడు ఈ రోజునే విశ్వసృష్టి ప్రారంభించాడని నమ్మకం. ఇంకో కథనం ప్రకారం సోమకాసురుడు బ్రహ్మ దగ్గర నుండి వేదాలను దొంగిలిస్తే విష్ణుమూర్తి మత్స్యావతారమెత్తి సోమకారుణ్ణి వధించి వేదాలను బ్రహ్మ దేవుడికి అప్పగించిన రోజు ఇదేనని, అందుకే ఆ రోజునే అనగా చైత్ర శుద్ధ పాడ్యమి రోజు ఉగాది జరుపుకోవాలని పురాణాలు చెబుతున్నాయి. ఇంకో కథనం శ్రీరాముడు, విక్రమాదిత్యుడు శాలివాహనుడు, పట్టాభిషిక్తుడైన రోజు ఉగాది నాడేనని, వరహామిహరుడు పంచాంగాన్ని జాతికి ఈరోజే అంకితం చేశాడని చెబుతారు. అందుకే ఈ రోజున ఉగాది జరుపుకుంటారని నమ్మకం. ఈ పండుగను దేశంలోని వివిధ రకాల పేర్లతో జరుపుకుంటారు. మహారాష్ట్రలో ‘గుడి పడవా’, పంజాబ్లో ‘వైశాఖి’, కేరళలో ‘విషు’, తమిళనాడులో ‘పుత్తండు’, బెంగాల్లో ‘భోషాక్’ గా జరుపుకోవడం ఒక సంప్రదాయం. ఈ పండగను కొంతమంది సౌరమానం ప్రకారం, కొంతమంది చాంద్రమానం ప్రకారం జరుపుకుంటారు.
తెలుగు పంచాంగం ప్రకారం యుగానికి అరవై సంవత్సరాలు దీనికి ఒక్కో సంవత్సరం ఒక్కో పేరు ఉంటుంది. ఈ పేర్లు ఎందుకు వచ్చాయంటే, కొందరు నారదుడి సంతానం పేర్లే వీటికి పెట్టారని, కొందరు దక్ష ప్రజాపతి కుమార్తె అయిన దాక్షాయణి కుమార్తెలకు 60 పేర్లు ఉన్నాయని ఆ పేర్లు ఇవేనని, ఇక ఇంకొంతమంది కృష్ణుడికి ఉన్న భార్యలలో సందీపని అనే రాజకుమారికి 60 మంది సంతానం ఉన్నారని వారి పేర్లే తెలుగు సంవత్సరాలకు పెట్టారని చెబుతారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు చాంద్రమానం ప్రకారం చైత్ర శుద్ధ పాడ్యమి రోజు ఉగాది జరుపుతున్నారు.
షడ్రుచుల సమ్మేళనం…
ఉగాది పండుగకు ఒక వారం ముందే ఇండ్లల్లో పండుగ వాతావరణం మొదలవుతుంది. ఇళ్ళు శుభ్రపరచుకుని, కొత్త బట్టలు కొనుగోలు చేసి, ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి, ఆవు పేడ కలిపిన నీళ్లతో ఇల్లు అలుక్కోవడం చేస్తుంటారు. ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకమైంది. ఇది షడ్రుచుల సమ్మేళనం తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం) అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని, భావోద్వేగాలతో కూడిన మానవుని జీవితం తీపి, చేదు అనుభవాలతో ముడిపడి ఉందని తెలియజేస్తుంది. ఈరోజున తీపి వంటకంగా కంది పప్పు, శెనగ పప్పు, బెల్లంతో తయారుచేసిన ఒబ్బట్లు(బొబ్బట్లు), పులిహోర లాంటివి ఆస్వాదిస్తారు. తెలంగాణలో ఈ పండుగ రోజున రైతులు వ్యవసాయదారులు పనుల నిమిత్తం పాలేర్లను నియమించుకొని, వారి జీతభత్యాలను నిర్ధారిస్తారు. సాయంత్రం కవి సమ్మేళనాలు పండితులకు సన్మానాలు జరుపుతారు. ఈ రోజే పంచాంగ శ్రవణం జరుపుట ఆచారంగా వస్తుంది. ఈ శ్రావణంలో ఆ సంవత్సరంలో మన స్థితిగతులను ముందే తెలుసుకోవచ్చు. దీంతో మనం తీసుకునే నిర్ణయాలను జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. పంచాంగ శ్రవణంలో తిథి, వారం, నక్షత్రం, యోగం, కారణం అనే ఐదు అంశాల గురించి ప్రస్తావిస్తారు. గత ఏడాది శుభకృత నామ సంవత్సరంలో మానవాళికి జరిగిన శుభాలు ఈ శోభకృతు నామ సంవత్సరంలో శోభా మయంగా వర్ధిల్లాలని కోరుకుందాము.