రాంచీ :
జార్ఖండ్ గిరిడీ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. నాలుగు రోజుల పసికందును పోలీస్ కానిస్టేబుల్ తొక్కాడని ఓ కుటుంబం ఆరోపించింది. దీంతో నవజాత శిశువు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. చిన్నారి తాత భూషణ్ పాండే ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించడంతో అది కాస్తా వైరల్గా మారింది. దీంతో ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని జిల్లా ఎస్పీని సీఎం హేమంత్ సోరెన్ ఆదేశించారు.
అయితే భూషణ్ పాండే ఓ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. చాలా రోజులుగా పోలీసుల నుంచి తప్పించుకుని తిరిగుతున్నాడు. ఈక్రమంలోనే అతడ్ని అరెస్టు చేసేందుకు పోలీసులు అతని ఇంటికి వెళ్లారు. ఉదయం 3:20 గంటల సమయంలో లోనికి ప్రవేశించారు. వీరిని చూసి భూషణ్ పాండేతో పాటు ఇతర కుటుంబసభ్యులు పారిపోయారు.
కానీ భూషణ్ కోసం వెతికే క్రమంలో ఓ గదిలో నిద్రిస్తున్న నాలుగు రోజుల పసికందును పోలీస్ కానిస్టేబుల్ పారపాటున తొక్కాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు వెళ్లిపోయాక లోపలికి వెళ్లి చూస్తే బిడ్డ చనిపోయి ఉందని పేర్కొన్నారు.
మరోవైపు పోలీసులు మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకే భూషణ్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని పేరొన్నారు. పోస్టుమార్టం రిపోర్టు తర్వాత అసలు వాస్తవాలు తెలుస్తాయన్నారు. సీఎం ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు.