మోడీకి ఎందుకు తొందరా…?
మోడీ జీ..! లక్ష ద్వీప్ ఘటన మరిచిపోయారా..?
కాంగ్రెస్ పార్టీ ఎం.పీ. రాహుల్ గాంధీని పార్లమెంటు నుంచి బర్తరఫ్ చేయడమేమిటీ..
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్.
లక్ష ద్వీప్ ఎం.పీ. మహమ్మద్ ఫైజల్ కు కోర్టులో శిక్ష పడిన సందర్భంలో కేంద్రంలోని బీజేపీ మోడీ ప్రభుత్వం ఫైజల్ ఎం.పీ. సభ్యత్వాన్ని రద్దు చేస్తే… కేరళ హై కోర్టు స్టే ఇచ్చిందని, ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకోకుండా కాంగ్రెస్ పార్టీ ఎం.పీ. రాహుల్ గాంధీని పార్లమెంటు నుంచి బర్తరఫ్ చేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఎందుకు తొందరా..? అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ప్రశ్నించారు.
గత నెలలో కేరళ హైకోర్టు ఇచ్చిన స్టే పై కేంద్ర బీజేపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిందని, అయితే సుప్రీం కోర్టు కేరళ హైకోర్టు ఇచ్చిన స్టే ను సమర్థిస్తూ ఈనెలలో తీర్పు ఇచ్చిందని వినోద్ కుమార్ తెలిపారు.
లక్ష ద్వీప్ ఎం.పీ. మహమ్మద్ ఫైజల్ స్థానానికి ఎన్నికలు నిర్వహించేందుకు ఈ.సీ.ఐ. నోటిఫికేషన్ ఇచ్చి కేరళ హైకోర్టు స్టే తో తిరిగి వాపస్ తీసుకోవాల్సి వచ్చిందని, ఫైజల్ ఎం.పీ. గా కొనసాగుతున్నారని వినోద్ కుమార్ గుర్తు చేశారు.
లక్ష ద్వీప్ ఘటన తెలిసీ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు తొందర పడ్డారని, రాహుల్ గాంధీ విషయంలో నరేంద్ర మోడీకి ఎందుకు అంత తొందరా..? అని వినోద్ కుమార్ నిలదీశారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీని పార్లమెంట్ మెంబర్ పదవీ నుంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బహిష్కరించడం అప్రజాస్వామికమని, అనైతికమని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు మాయని మచ్చ అని బోయినపల్లి వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు.
ప్రతిపక్ష పార్టీల నాయకులను ప్రజాస్వామికంగా ఎదుర్కొనే ధైర్యం లేక.. అనైతిక చర్యలకు పాల్పడటం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అలవాటై పోయిందని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయడం దేశ ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని వినోద్ కుమార్ అన్నారు.
సీబీఐ, ఈడీ దాడులతో విపక్ష పార్టీల నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం.. ఇప్పుడు తాజాగా చట్టాన్ని కూడా దుర్వినియోగం చేస్తోందని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పిలేట్ కోర్టుకు వెళ్లే అవకాశం రాహుల్ గాంధీకి ఉంటుందని, అప్పిలెట్ కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా ఇవ్వకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పార్లమెంటు నుంచి రాహుల్ గాంధీని బర్తరఫ్ చేయడం ఎంత మాత్రం ఆమోద యోగ్యం కాదని వినోద్ కుమార్ అభిప్రాయ పడ్డారు.
రాహుల్ గాంధీని పార్లమెంటు నుంచి బర్తరఫ్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉప సంహరించుకోవాలని, ప్రజాస్వామిక విలువలను కాపాడాలని వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.