సంగారెడ్డి జిల్లా విద్యాధికారి(డీఈవో) నాంపల్లి రాజేశ్ అవినీతి నిరోధక శాఖ(ACB)కి చిక్కారు. సీనియర్ అసిస్టెంట్ ద్వారా ఒక ప్రైవేటు పాఠశాల యాజమాన్యం నుంచి రూ.50 వేలను లంచంగా తీసుకుంటూ పట్టుబడ్డారు.
నాంపల్లి రాజేశ్ 2016-18 వరకు నిజామాబాద్ డీఈవోగా పనిచేశారు. అప్పట్లో మరికొన్ని రోజుల్లో ప్రాంతీయ సంయుక్త సంచాలకులు(ఆర్జేడీ) గా పదోన్నతి వస్తుందనగా.. నిజామాబాద్ జిల్లా ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆయనపై అవినీతి ఆరోపణలు చేశారు. విచారణలో వాస్తవాలు వెలుగుచూడటంతో రాజేశ్ను 2018 అక్టోబరులో బాధ్యతల నుంచి తప్పించి, హైదరాబాద్ ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేశారు. తర్వాత 2020లో సంగారెడ్డి డీఈవోగా నియమించారు. త్వరలోనే ఆర్జేడీగా పదోన్నతి వచ్చేందుకు అవకాశముందని భావిస్తుండగా, మరోసారి అనిశాకు దొరకడం గమనార్హం.