44 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు
హైదరాబాద్ :
తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో సేవలందించిన 44 మంది ప్రముఖులకు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ 2020 సంవత్సరానికి కీర్తి పురస్కారాలను ప్రకటించింది. వర్సిటీ వీసీ ప్రొఫెసర్ తంగెడ కిషన్ రావు అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల సంఘం తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులను పురస్కారానికి ఎంపిక చేసింది. పురస్కారాలకు ఎంపికైనవారిలో నారు (కార్టూనిస్ట్), సముద్రాల వెంకట రంగ రామానుజాచార్యులు (ఆధ్యాత్మిక సాహిత్యం), పుత్తా పుల్లారెడ్డి (ప్రాచీన సాహిత్యం), వీవీ రామారావు (సృజనాత్మక సాహిత్యం), టీవీ ప్రసాద్ (కాల్పనిక సాహిత్యం), వారాల ఆనంద్ (అనువాద సాహిత్యం), ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి (బాలసాహిత్యం), ఎజాజ్ అహ్మద్ (ఉత్తమ ఉపాధ్యాయుడు), ప్రొఫెసర్ ప్రీతి సంయుక్త (చిత్రలేఖనం) తదితరులు ఉన్నారు. ఈ నెల 28,29 తేదీలలో వర్సిటీ ఆడిటోరియంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో వారిని సత్కరిస్తామని తెలుగు వర్సిటీ రిజిస్ట్రార్ భట్టు రమేశ్ తెలిపారు