పొరపాటున పేలిన మూడు క్షిపణులు..!
జైసల్మేర్ :
సైన్యం నిర్వహించిన సాధారణ కసరత్తుల్లో పొరపాటున మూడు క్షిపణులు పేలాయి. రాజస్థాన్ లోని జైసల్మేర్‌లో ఈ ఘటన జరిగింది..
పోఖ్రాన్‌లోని ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ వద్ద జరిగిన ఈ ఘటనలో సాంకేతిక లోపమే కారణమని తెలుస్తోంది. ఈ క్షిపణులు సమీప గ్రామాల్లోని పొలాల్లోకి దూసుకెళ్లాయి. దాంతో భారీ పేలుడు సంభవించింది. అయితే, ఈ ప్రమాదం వల్ల ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లలేదని అధికారులు వెల్లడించారు. 10-25 కిలోమీటర్ల పరిధి వరకు దూసుకెళ్లే ఈ క్షిపణులను పరీక్షిస్తోన్న తరుణంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
దీనిపై రక్షణ శాఖ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ అమితాబ్ శర్మ స్పందించారు. ‘సాధారణ విన్యాసాల్లో భాగంగా క్షిపణులు మిస్‌ఫైర్ అయ్యాయి. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు జరగుతోంది’ అని తెలిపారు. ఇక పొలాల్లోకి దూసుకెళ్లిన రెండు క్షిపణుల శకలాలను అధికారులు గుర్తించారు. మూడో దానికోసం పోలీసులు, ఆర్మీ సిబ్బంది గాలిస్తున్నారు..