ఈ మద్య మనిషికి మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఊహించలేకపోతున్నారు.. వాన రాకడ.. ప్రాణం పోకడ ఎవరికీ తెలియదని అంటారు. రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు మరణాలు, అగ్ని ప్రమాదాలు, బాంబు పేలుళ్లు ఇలా ప్రతిరోజూ ఏదో ఒక రూపంలో మనుషులను మృత్యవు కబలించేస్తుంది. ఇటీవల హైదరాబాద్ లో వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎన్ని భద్రతా చర్యలు చేపట్టినప్పటికీ చిన్న పొరపాటు వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయి. తాజాగా కింగ్ కోఠీలో భారీ అగ్రి ప్రమాదం సంభవించింది.
వివరాల్లోకి వెళితే…
ఇటీవల నగరంలో పలు చోట్ల వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. అగ్ని ప్రమాదాల వల్ల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా సంభవిస్తుంది. తాజగా కింగ్ కోఠిలో ఓ కారు మెకానిక్ షెడ్ లో శనివారం తెల్లవారుజామున పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించింది. దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. దట్టమైన పొగలు అలుముకున్నాయి. అక్కడే కారులో నిద్రిస్తున్న ఓ వ్యక్తి సజీవదహనం అయ్యాడు. మృతుడు సెక్యూరిటీ గార్డు సంతోష్ గా పోలీసులు గుర్తించారు. ఈ మంటల్లో ఏడు కార్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి. కాగా, ఒక్కసారిగా భారీ పేలుళ్ల శబ్ధాలు రావడంతో చుట్టుపక్కల జనాలు ఒక్కసారే ఉలిక్కి పడ్డారు.. మంటలు చూసి భయాందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు, ఫైర్ సిబ్బందికి తెలియజేశారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు.. ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ అగ్ని ప్రమాదం ఎలా సంభవించిందనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో మంటలు చెలరేగి ఆరుగురు చనిపోయారు. అలాగే దక్కన్ మాల్ లో అగ్ని ప్రమాదం జరిగి ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. నగరంలో వరుస అగ్ని ప్రమాదాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని దయనీయ స్థితిలో మృతుడు సంతోష్ కుటుంబం ఉందని.. సంపాదించే కొడుకు చనిపోవడంతో సంతోష్ మృతదేహం వద్ద కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. సంతోష్ కి ఒక పాప, బాబు ఉన్నాడు. తండ్రి చనిపోయాడని తెలిసి బిక్క ముఖం వేసుకొని కూర్చున్నారు. కొడుకు చివరి చూపు కూడా నోచుకోలేని పరిస్థితి అని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. పగలు చెప్పుల షాపు, రాత్రి షెడ్ లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న సంతోష్ చనిపోవడంతో కుటుంబ సభ్యులే కాదు.. స్థానికులు సైతం శోక సంద్రంలో మునిగిపోయారు.