2 రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షం

2 రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షం…

ఈమధ్య కాలంలోనే అకాల వర్షాలు కర్షకుడిని కష్టాల పాలు చేసింది. కనివినీ ఎరుగని రీతిలో పంట నష్టం కలిగింది. ఇప్పుడు మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈదురుగాలులతో, వడగండ్లతో కూడిన వాన కురవనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

పంటలకు నష్టం వాటిల్లి ఆర్థికంగా కుదేలైన రైతులకు ఇదొక పిడుగుపాటు వార్తే అవ్వనుంది. రాష్ట్రంలో నేడు రేపు రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది. ఇదే సమయంలో ఈశాన్య తెలంగాణలో ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30నుంచి 40కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షాలు పడుతాయని హెచ్చరించింది. రాయలసీమ పరిసర ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఇవాళ బలహీనపడిందని ఉపరితల ద్రోణి ఝార్ఖండ్ చత్తీస్ గఢ్, విదర్బ,తెలంగాణ రాష్ట్రం ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 0.9కిలో మీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతుందని వాతావరణ కేంద్రం వివరించింది.

ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షం కురవడం వల్ల తెలంగాణలో ఎంతో పంట నష్టం కలిగింది. మొక్కజొన్న, మిర్చి, వరి పంటలు తీవ్ర నష్టం వాటిల్లింది. పదిహేను రోజుల్లో పంట చేతికొస్తుంది అనే తరుణంలోనే అనుకోని అకాల వర్షాలు కురిసి రైతుకు కంట నీరు మిగిల్చింది. వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్, కరీంనగర్ జిల్లాల్లో తీవ్రంగా పంట నష్టం కలిగింది.

వివిధ జిల్లాల్లో ఇలా..

వరంగల్, హన్మకొండలో వర్షం బీభత్సం సృష్టించింది. హన్మకొండ జిల్లాలోని పరకాల రెవెన్యూ డివిజన్ లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ జిల్లాల్లో మొక్కజొన్న, మిర్చి పంటలు విపరీతంగా దెబ్బతిన్నాయి. ఇవేగాక నర్సంపేట నియోజక వర్గంలో కూడా వర్ష బీభత్సానికి రైతులకు తీరని నష్టమే కలిగింది. నల్లబెలి, దుగ్గొండి, చెన్నారావుపేట, ఖానాపురం, నర్సంపేట, నెక్కొండ, గీసుగొండ ప్రాంతాల్లో వేసిన మామిడి పంట బాగా దెబ్బతింది. అలాగే మహబూబాద్ జిల్లాలో కురిసిన వడగండ్ల వానకి రైతులు ఎంతో నష్టపోయారు. పలు రకాల పండ్ల తోటలు నేలమట్టం అయ్యాయి. దిక్కు తోచని స్థితిలో రైతులు ప్రభుత్వాన్ని సాయం కోరారు.

రూ.10వేలు…

ఇటీవల తెలంగాణలో కురిసిన అకాల వర్షాలకు మొత్తం 2.28లక్షల ఎకరాల పంట నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. మొక్కజొన్న, మిర్చి వేసిన చాలా మంది రైతులు చాలా వరకు తీవ్రంగా నష్టపోయారు. ఈ అకాల వర్షాలతో ఆర్థికంగా కుదేలైన రైతులు కోసం ప్రభుత్వం ఎన్నో సహాయక చర్యలు చేపట్టింది. చాలా మంది ఎమ్మెల్యేలు వారి నియోజక వర్గాల్లో పర్యటించారు. రైతులను ఆదుకుంటామని హామీలిచ్చారు. ఎకరాకు పదివేల ఆర్థిక అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దానికి సంబంధించిన జీవోను సైతం ప్రభుత్వం జారీ చేసింది.