హైదరాబాద్ :
కాంగ్రెస్ పార్టీ, అగ్రనేత రాహుల్ గాంధీపై భాజపా ఎన్ని కుట్రలు చేసినా ప్రజల తరఫున చేసే పోరాటం ఆగదని ఆ పార్టీ నేతలు చెప్పారు. రాహుల్ లోక్‌సభ సభ్యత్వం రద్దును వ్యతిరేకిస్తూ “సంకల్ప్ సత్యాగ్రహ” పేరుతో కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. హైదరాబాద్ గాంధీభవన్లోనూ కాంగ్రెస్ నేతలు దీక్ష చేపట్టారు. రాహుల్ గొంతును అణచివేసి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని భాజపా, మోదీ చూస్తున్నారని.. అలాంటి కుట్రలను తిప్పి కొడతామని కాంగ్రెస్ నేతలు చెప్పారు.
రాహుల్‌గాంధీని ఎదుర్కొనే ధైర్యం లేక అనర్హత వేటు వేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ ఆరోపించారు. దేశ స్వాతంత్ర్యం కోసం రాహుల్ తాత నెహ్రూ జైలుకు వెళ్లారన్నారు. రాహుల్‌గాంధీపై అనర్హత వేటును నిరసిస్తూ చేపట్టాల్సిన ఆందోళనపై కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా చేయాలనే అంశంపై చర్చ జరుగుతోందని.. ఈ విషయంలో ఏఐసీసీ నిర్ణయం ప్రకారం నడుచుకుంటామన్నారు. పార్టీ ఆదేశిస్తే అందరం రాజీనామా చేస్తామని చెప్పారు.
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ రాహుల్‌పై అనర్హత వేటు నిర్ణయం కంటతడి పెట్టించిందన్నారు. ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా రాహుల్ వదులుకున్నారని చెప్పారు. ‘‘అదానీ గురించి మాట్లాడినందుకే రాహుల్‌పై కుట్ర చేశారు. పార్లమెంట్లో ప్రశ్నిస్తారనే భయం భాజపాలో పెరిగింది. ఆగమేఘాల మీద పరువునష్టం కేసులో శిక్ష పడేలా చేశారు. అవసరమైతే కాంగ్రెస్ ఎంపీలందరూ రాజీనామా చేయాలి. రాహుల్‌పై అనర్హత వేటు ఎత్తివేసే వరకు పోరాటం చేస్తాం. ఇందిరాగాంధీపై వేటు వేస్తే ఏం జరిగిందో ఇప్పుడూ అదే జరుగుతుంది’’ అని కోమటిరెడ్డి వెంట్‌రెడ్డి అన్నారు. ఈ దీక్షలో రేవంత్‌రెడ్డితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొన్నాల, వీహెచ్, ఇతర నేతలు పాల్గొన్నారు.