రాష్ట్రంలో పోస్టర్ల వార్ కొనసాగుతున్నది. ఇటీవల ప్రధాని మోదీ, అమిత్‌షాకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి హైదరాబాద్‌లో మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ఉప్పల్ – నారపల్లి ఫ్లై ఓవర్ ప్రారంభమై సంవత్సరాలు గడుస్తున్నా.. కనీసం సగం కూడా పూర్తి కాలేదు. దీన్ని విమర్శిస్తూ ‘మోదీ గారు ఈ ఫ్లైఓవర్ ఎన్ని సంవత్సరాలు కడతారు..?’ అంటూ పిల్లర్లకు పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి.
ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ ఇంకా ఎన్ని సంవత్సరాలు కడతారంటూ ప్రశ్నించారు. ఐదు సంవత్సరాలైనా ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ 40 శాతం కూడా పూర్తికాలేదంటూ ఆరోపించారు. ఫ్లైఓవర్ పిల్లర్లపై మోదీ చిత్రపటాన్ని వేసి మరీ పోస్టర్లలో విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ – వరంగల్ వెళ్లే జాతీయ రహదారిలో ఫ్లై ఓవర్ పిల్లర్లకు వీటిని గుర్తు తెలియని వ్యక్తులు అంటించారు.
దాంతో పాటు మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉన్న ప్లైఓవర్ పిల్లర్లపై కూడా పోస్టర్లు దర్శనమిచ్చాయి. మొత్తానికి ఆరు కిలోమీటర్ల మేర ఉన్న ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్లపై అడుగడుగునా ఈ పోస్టర్లు వెలియడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.
భారత్‌మాల పథకం కింద..
ఇదిలా ఉండగా ఉప్పల్ – మేడిపల్లి మధ్య వరంగల్ హైవేపై ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు భారత్‌మాల పథకం కింద రూ.626.80 కోట్ల వ్యయంతో 6.2 కిలోమీటర్ల దూరంతో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఉప్పల్ జంక్షన్ నుంచి మేడిపల్లి సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ దాకా ఈ ఫ్లైఓవర్ వేయాలని కేంద్రం నిర్ణయించింది.
2018, మేలో ఈ ఫ్లై ఓవర్‌కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. జూలైలో పనులు ప్రారంభమవగా 2020 జూన్ వరకు నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ధేశించినా.. పనులు నత్తనడకన సాగుతున్నాయి.
ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఈ 45 మీటర్ల ఆరులేన్ల కారిడార్ పనులు నత్తనడక సాగుతున్నది. మరోవైపు ఈ నిర్మాణ పనులతో రోడ్డు పూర్తిగా దెబ్బతింది. కారిడార్ పనులు పూర్తయితేనే రోడ్డు పనులు పూర్తిచేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. నత్తనడకన సాగుతున్న ప్రజలు నిత్యం నరకయాతనకు గురవుతున్నారు.