TSPSC లీకేజ్ కేసులో మూడో రోజు నిందితుల విచారణ మొదలు

టీఎస్‌పీఎస్సీ (TSPSC) ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్‌ దర్యాప్తు కొనసాగుతున్నది. కస్టడీలో నిందితులను సిట్‌ మూడోరోజు విచారిస్తున్నది. ఈ కేసులో నలుగురు నిందితులైన ప్రవీణ్‌, రాజశేఖర్‌రెడ్డి, డాక్యానాయక్, రాజేశ్వర్‌ నాయక్‌ల కస్టడీ ఈరోజుతో ముగియనున్నది. కాబట్టి వీలైనంత మేరకు నిందితుల నుంచి సమాచారం రాబట్టడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.

సర్వీస్‌ కమిషన్‌లో ఏఎస్‌వోగా పనిచేస్తున్న ప్రవీణ్ నుంచి రేణుక ఏఈ ప్రశ్నపత్రం కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. రేణుక ఇద్దరికే ప్రశ్నపత్రం విక్రయిస్తున్నాని చెప్పి ప్రవీణ్‌కు రూ. 10 లక్షలు ముట్టచెప్పి కొనుగోలు చేసింది.

అయితే తర్వాత రేణుక భర్త డాక్యానాయక్, ఆమె సోదరుడు రాజేశ్వర్‌నాయక్‌ చాలామందికి ప్రశ్నపత్రం విక్రయించినట్లు సిట్‌ అధికారుల దర్యాప్తులో తేలింది. రేణుకకు తెలియకుండానే ఆమె భర్త బేరం కుదుర్చుకుని ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పలువురికి విక్రయించినట్టు సమాచారం.

ఉపాధి హామీ పథకంలో టెక్నికల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న డాక్యా అందులోనే పనిచేసే సివిల్‌ ఇంజినీర్‌, కాంట్రాక్ట్‌ ప్రాతిపదిక పనిచేస్తున్న వారందరికీ మధ్యవర్తులను ఏర్పాటు చేసుకుని వాళ్లకు ఏఈ ప్రశ్నపత్రం విక్రయించినట్లు సిట్‌ అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఇప్పటికే ప్రశాంత్‌, రాజేష్‌ ఇద్దరినీ కూడా సిట్‌ అధికారులు అరెస్టు చేశారు. దీనిపై డాక్యా ద్వారా సమాచారం సేకరించారు.

అయితే ఏఈ ప్రశ్నపత్రం ఇంకా ఎంతమందికి విక్రయించారనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. మూడు రోజుల కస్టడీలో భాగంగా డాక్యాను విచారించగా కొత్త పేర్లు బైటికి వచ్చాయి. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌పై కూడా సిట్‌ అధికారులు దృష్టి సారించారు. దీనిపై ప్రవీణ్‌, రాజశేఖర్‌రెడ్డిలను ప్రశ్నిస్తున్నారు.

వారు టీఎస్‌సీపీఎస్సీలో పనిచేసే సురేశ్‌, రమేశ్‌, షమీమ్‌ ఈ ముగ్గురికి రాజశేఖర్‌, ప్రవీణ్‌ కలిసి ప్రశ్నపత్రం ఇచ్చినట్టు గుర్తించారు. షమీమ్‌ మాత్రం తనకు గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రం ఇచ్చినందుకు ఎలాంటి డబ్బులు తీసుకోలేదని అధికారులకు చెప్పింది. సురేశ్‌ కూడా అలాగే చెప్పాడు.

ఇప్పటివరకైతే నగదు లావాదేవీలకు సంబంధించి బయట పడలేదు. రాజశేఖర్‌రెడ్డి తన న్యూజిలాండ్‌ ఉంటున్న తన బావ ప్రశాంత్‌కు విక్రయించినట్టు విచారణలో తేలింది. ఇంకా ఎంతమందికి విక్రయిచారనే విషయాన్ని తెలుసుకోవడానికి సిట్‌ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నలుగురి నిందితుల కస్టడీ ఈరోజుతో ముగియనుండటంతో వీలైనంత సమాచారం సేకరించాలని అధికారులు యత్నిస్తున్నారు.

మరోముగ్గురు నిందితులు షమీమ్‌, రమేష్‌, సురేశ్‌లు ప్రస్తుతం చంచల్‌గూడ్‌ జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్నారు. వారిని ఆరు రోజుల కస్టడీకి ఇవ్వాలని సిట్‌ అధికారులు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఇప్పటికే వాదనలు ముగిశాయి.

దీనిపై నాంపల్లి కోర్టు ఈరోజు నిర్ణయం తీసుకోనున్నది. ఒకవేళ ఆ ముగ్గురు నిందితులను కస్టడీకి కోర్టు అనుమతిస్తే వారిని ప్రశ్నిస్తే వాళ్ల ద్వారా ప్రశ్నపత్రం బైటికి వెళ్లిందా? అనే సమాచారం తెలుసుకోవడానికి సిట్‌ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో సిట్‌ అధికారులు ఇప్పటికే 15 మందిని అరెస్ట్‌ చేశారు.