పాన్- ఆధార్ అనుసంధానానికి గడువు పొడిగింపు
దిల్లీ :
పాన్- ఆధార్ (PAN – AAdhaar) అనుసంధానానికి గడువును కేంద్రం పొడిగించింది. మార్చి 31తో గడువు ముగియాల్సి ఉండగా.. మరో మూడు నెలలు పెంచుతూ జూన్ 30 వరకు అనుసంధానానికి అవకాశం ఇచ్చింది. పన్ను చెల్లింపుదారులకు మరింత సమయం ఇచ్చే ఉద్దేశంతో గడువు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) తెలియజేసింది. నిర్దేశిత గడువులోగా పాన్- ఆధార్ అనుసంధానం పూర్తి చేయకుంటే జులై 1 నుంచి పాన్ నిరుపయోగంగా మారనుంది.
పాన్ కార్డు (Pan Card) ఉన్న ప్రతి వ్యక్తీ ఆదాయపు పన్ను చట్టం-1961 ప్రకారం ఆధార్‌తో (Aadhaar) అనుసంధానం చేయాలి. ఇప్పటికే దీనికి సంబంధించిన గడువు ముగిసింది. రూ.1000 అపరాధ రుసుముతో మార్చి 31లోపు అనుసంధానానికి చివరి అవకాశం ఇచ్చింది. తాజాగా ఆ గడువును మరో మూడు నెలలు పొడిగించింది. చెల్లుబాటులో లేని పాన్‌తో బ్యాంకు ఖాతా, డీమ్యాట్ ఖాతాల్లాంటివి తెరవలేరు. మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేసేందుకూ నిబంధనలు అడ్డువస్తాయి. ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం చట్టపరమైన చర్యలకు బాధ్యులు అవుతారు. ఇప్పటికే 51 కోట్ల పాన్లు ఆధార్‌తో అనుసంధానం అయ్యాయని సీబీడీటీ పేర్కొంది.