కేంద్రమంత్రినితిన్గడ్కరీకి… మంత్రి వేములప్రశాంత్రెడ్డి బహిరంగ లేఖ

కేంద్రమంత్రినితిన్గడ్కరీకి… మంత్రి వేములప్రశాంత్రెడ్డి బహిరంగ లేఖ…

గౌ|| శ్రీ నితిన్ జైరాం గడ్కరీ గారికి నమస్కారములతో..

ఏప్రిల్ 1వ తారీఖు నుండి తెలంగాణ రాష్ట్ర పరిధిలోని NHAI కి సంబందించిన 32 టోల్ గేట్ల ద్వారా కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే టాక్స్ ని మళ్ళీ పెంచబోతున్నారని నాకు తెలియవచ్చింది.

ఇప్పటికే మీరు వసూలు చేస్తున్న టోల్ టాక్స్ తెలంగాణ ప్రజలకు పెనుభారంగా మారిందని మీకు తెలియజేస్తున్నా. మళ్ళీ టోల్ టాక్స్ రేట్లు గనుక పెంచితే “మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లు” అవుతుంది.

2014 సంవత్సరంలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 600 కోట్లు టోల్ టాక్స్ వసూలు చేస్తే.. దాన్ని ప్రతీ ఏడాది పెంచుకుంటూ పోతూ..ఈ సంవత్సరం 2023లో 1824 కోట్లు వసూలు చేశారు. అంటే ఈ 9 సంవత్సరాలకాలంలో టోల్ టాక్స్ వసూలు 300% పెంచారు. ఈ టోల్ టాక్స్ పెంపువల్ల ట్రక్కుల ద్వారా సరఫరా చేసే నిత్యావసరాల ధరలు పెరిగాయి. సామాన్యులు ప్రయాణించే బస్సు చార్జీలు పెరిగాయి. దీంతో మధ్య తరగతి ప్రజల జీవనం పూర్తి భారంగా తయారయ్యింది.

ఇదిలా ఉంటే…

తెలంగాణ నుంచి ఉన్న ఏకైక కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారు,పలువురు బీజేపీ నాయకులు తరుచూ కేంద్రం జాతీయ రహదారుల కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిందని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల కోసం మంజూరీలు కాగితాల మీద కొండంత ఉంటే..ఖర్చు చేసింది మాత్రం గోరంతనే.

2014 నుంచి నేటి వరకు కేంద్రం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 113NH ప్రాజెక్టులు మరియు CRIF వర్క్స్ గాను మొత్తం కలిపి 1,25,176 కోట్లు మంజూరు చేసినట్టు కాగితాల మీద చూపిస్తున్నా.. ఈ 9 సంవత్సరాల్లో ఖర్చు చేసింది కేవలం 20,350 కోట్లు మాత్రమే.

ఆ ఖర్చు చేసిన 20,350 కోట్లకు గాను జాతీయ రహదారుల సంస్థ గత 9 సంవత్సరాల్లో టోల్ టాక్స్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 9 వేల కోట్ల టోల్ వసూలు చేసింది. అంటే కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసిన దాంట్లో తెలంగాణ ప్రజల నుంచి ఇప్పటికే సగం డబ్బులు టోల్ టాక్స్ ద్వారా ముక్కుపిండి వసూలు చేశారు. “కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయింది” అన్న చందంగా ఉన్నది కేంద్ర ప్రభుత్వ వైఖరి.

అంతే కాకుండా పెట్రోల్,డీజిల్ ధరలు పెంచడం ద్వారా మరియు పెట్రోల్,డీజిల్ పై అదనపు రోడ్ సెస్సుల పేరిట తెలంగాణ రాష్ట్ర ప్రజల నుండి ఈ 9 సంవత్సరాలకాలంలో కేంద్రం ఎన్ని కోట్లు వసూలు చేసింది.? ఆ డబ్బు ఎటు పోతుందో మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు లెక్క చెప్పాల్సిన అవసరముందని నేను భావిస్తున్నా.

కావున..

కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల కోసం తెలంగాణలో లక్షల కోట్లు ఖర్చు చేసిందని పదేపదే అబద్దాలు ప్రచారం చేస్తున్న రాష్ట్ర బీజేపీ నేతలకు ఈ వాస్తవ విషయాలు కేంద్ర ఉపరితల రవాణా శాఖ ద్వారా మీరు తెలియజేస్తే మంచిది. వారు ప్రజల్లోకి బలవంతంగా జొప్పిస్తున్న అబద్ధాలు, అసత్యపు ప్రసంగాలు మానుకోవాలని సూచించాల్సిన బాధ్యత కూడా మీదే.

టోల్ టాక్స్ పెంచుతూ.. పెట్రోల్ డీజిల్ పై సెస్ లు వసూలు చేస్తూ.. సామాన్యులను అరిగోస పెడుతున్న కేంద్ర ప్రభుత్వం తమ వైఖరి మార్చుకోవాలని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నా.

ఏప్రిల్ 1వ తేదీ నుండి టోల్ టాక్స్ రేట్ల పెంపుదల నిర్ణయాన్ని మీరు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా.

భవదీయుడు…

వేముల ప్రశాంత్ రెడ్డి రోడ్లు భవనాలు శాఖభవనాలు శాఖ మంత్రి తెలంగాణ రాష్ట్రం.

To

శ్రీ నితిన్ జైరాం గడ్కరి , గౌIl మంత్రి వర్యులు కేంద్ర ఉపరితల రవాణా మరియు జాతీయ రహదారులు , భారత ప్రభుత్వం.