సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తం

సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తం

అందరి దృష్టి పార్లమెంట్‌ ఎన్నికలపైనే ఇప్పట్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు లేనట్టే..!

ఫిబ్రవరిలో రానున్న ప్రత్యేకాధికారుల పాలన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మరోసారి ఓటరు జాబితాకు సవరణలు

2024 జనవరి 1 నాటికి 18 ఏండ్లు నిండిన వారికి ఓటరుగా నమోదుకు అవకాశం దరఖాస్తులు స్వీకరిస్తున్న బూత్‌ లెవల్‌ అధికారులు ఫిబ్రవరి 8న తుది ఓటరు జాబితా విడుదల ఎంపీ ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్లతో ఈసీ వీడియో కాన్ఫరెన్స్‌ ఎంపీ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలో మెదక్‌, జహీరాబాద్‌ పార్లమెంట్‌ స్థానాలు ఉన్నాయి. వీటితో పాటు సిద్దిపేట జిల్లా పరిధిలో కరీంనగర్‌, భువనగిరి పార్లమెంట్‌ స్థానాలు విస్తరించి ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో విజయయే లక్ష్యంగా ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జిలను నియమించింది. బీఆర్‌ఎస్‌ పార్టీ ఇటీవల సంగారెడ్డి, జహీరాబాద్‌, నర్సాపూర్‌లో కార్యకర్తల సమావేశాలు నిర్వహించింది. ఈ సమావేశాల్లో పార్టీ అగ్రనేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు. త్వరలో జరగనున్న పార్లమెంట్‌, స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. కాగా, ఫిబ్రవరిలో ఎంపీ ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే అవకాశం ఉంది. బుధవారం ఎన్నికల కమిషన్‌ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి ఎన్నికలకు సిద్ధం కావాలని ఆదేశించింది. కొత్తగా ఓటు హక్కు కల్పించేందుకు, మార్పులు చేర్పులకు ఈసీ అనుమతి ఇవ్వడంతో అధికార యంత్రాంగం ఆ పనిలో నిమగ్నమైంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో అత్యధిక అసెంబ్లీ స్థానాలను బీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. దీంతో ఎంపీ ఎన్నికల్లో తన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.

సిద్దిపేట , డిసెంబర్‌ :

ఇటీవల రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ముగిసి నూతన ప్రభుత్వం ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఇక స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పార్లమెంట్‌ ఎన్నికలు నూతన సంవత్సరంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. ముందుగా స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయని అన్ని పార్టీల వారు, ఆశావహులు భావించారు. కానీ, ప్రస్తుత పరిస్థితులో స్థానిక సంస్థలు ఎన్నికలు ఇప్పట్లో జరిగే ఛాన్స్‌ లేదని పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొత్త ప్రభుత్వం ఇటీవలే ఏర్పడినందున ఇప్పుడే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే అవకాశం లేదని చెప్పవచ్చు. జనవరి నెలతో ముగియనున్న సర్పంచ్‌ల స్థానంలో ప్రత్యేకాధికారుల పాలన రానున్నట్టు సమాచారం. ఫిబ్రవరి నుంచి ప్రత్యేకాధికారుల పాలన గ్రామాల్లో కొనసాగనున్నది. ఇక అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంట్‌ ఎన్నికలపై దృష్టిపెట్టాయి. కొత్త సంవత్సరంలో ఫిబ్రవరిలో పార్లమెంట్‌ ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే అవకాశం ఉంది. ఆ దిశగానే ఓటరు జాబితాలో సవరణలు, నూతన ఓటరు నమోదు తదితర ప్రక్రియను ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు జిల్లాల అధికార యంత్రంగాలు చేపడుతున్నాయి. జనవరి 1 నాటికి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేయడానికి విస్తృత ఏర్పాటు చేస్తున్నారు. గ్రామ స్థాయిలోని బూత్‌లెవల్‌ అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. వీటితో పాటు ఓటరు జాబితాలో పేరు తప్పుల సవరణతో పాటు ఇతర ప్రాంతాలకు మార్పు చేసుకునే అవకాశం కల్పించడంతో సంబంధిత ఫారాలను నింపి అధికారులకు అందిస్తున్నారు. ఆన్‌లైన్‌లో సైతం దరఖాస్తు చేసుకునే అవకాశం సైతం ఎన్నికల కమిషన్‌ కల్పించింది. మొత్తంగా ఫిబ్రవరి రెండో వారంలో తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంట్‌ ఎన్నికలపై దృష్టిసారించి కార్యాచరణను సిద్ధం చేస్తున్నాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మెదక్‌, జహీరాబాద్‌ పార్లమెంట్‌ స్థానాలు ఉంటాయి. వీటితో పాటు సిద్దిపేట జిల్లా పరిధిలో కరీంనగర్‌, భువనగిరి పార్లమెంట్‌ స్థానాలు విస్తరించి ఉన్నాయి. మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఇటీవల దుబ్బాక ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఇటీవల ఎంపీ పదవికి రాజీనామా చేశారు. పార్లమెంట్‌ ఎన్నికలకు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలు సమాయత్తం అవుతున్నాయి. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఇటీవల సంగారెడ్డి, జహీరాబాద్‌, నర్సాపూర్‌లో కార్యకర్తల సమావేశాలు నిర్వహించి పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు. త్వరలో జరగనున్న పార్లమెంట్‌, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. త్వరలోనే మిగతా నియోజకవర్గాల సమావేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ పార్టీ సైతం పార్లమెంట్‌ నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను నియమించింది. ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే అవకాశం ఉండడంతో సార్వత్రిక ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సమాయత్తం అవుతున్నాయి.

నూతన ఓటరు నమోదు.. ఓటరు జాబితాలో సవరణలు

ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని పది నియోజకవర్గాలతో పాటు సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్‌ నియోజకవర్గం కలుపుకొని 11 శాసనసభ స్థానాలు ఉన్నాయి. మొన్నటి శాసనసభ నియోజకవర్గ ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గంలో 2,33,733 మంది, దుబ్బాక నియోజకవర్గంలో 1,98,100మంది, గజ్వేల్‌ నియోజకవర్గంలో 2,74,645 మంది, హుస్నాబాద్‌ నియోజకవర్గంలో 2,42,177 మంది, మెదక్‌ నియోజకవర్గంలో 2,16,748 మంది,నర్సాపూర్‌ నియోజకవర్గంలో 2,23,593 మంది,సంగారెడ్డి నియోజకవర్గంలో 2,45,253 మంది, నారాయణ్‌ఖేడ్‌ నియోజకవర్గంలో 2,31,188 మంది, జహీరాబాద్‌ నియోజకవర్గంలో 2,70,785 మంది, పటాన్‌చెరు నియోజకవర్గంలో 3,97,237, ఆందోల్‌ నియోజకవర్గంలో 2,49,248 మంది ఓటర్లు ఉన్నారు.

మరోసారి ఓటరు నమోదుకు అవకాశం..

ప్రస్తుతం పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో మరోసారి ఓటరు నమోదు, సవరణలకు ఎన్నికల సంఘం అవకాశం ఇవ్వడంతో ఈ సంఖ్య మరింతగా పెరగనున్నది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అన్ని గ్రామాల్లోని పోలింగ్‌ బూత్‌ కేంద్రాల్లో అంగన్‌వాడీ టీచర్లు ఓటు హక్కు నమోదు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 2024 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునే విధంగా గ్రామాల్లో వివిధ ప్రచార మాధ్యమాల ద్వార విస్తృత ప్రచారం చేస్తున్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతి పౌరుడు తమ ఓటు నమోదు చేసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందని గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతం ఓటు నమోదు చేసుకుంటే వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో తమ ఓటు ద్వారా దేశ ప్రధానిని ఎన్నుకునే అవకాశం దక్కుతుంది. అందువల్ల అర్హులైన ప్రతి ఒక్కరూ విధిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని క్షేత్రస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు అధికార యంత్రాంగం కోరుతున్నది. ఓటరు జాబితాలో సైతం తప్పొప్పులను సైతం సవరణ చేసుకోవడంతో పాటు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మార్పు చేసుకోవడానికి సైతం అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. సంబంధిత ఫారాన్ని నింపి గ్రామ స్థాయిలోని పోలింగ్‌ బూత్‌ అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. వాటిని జిల్లా ఎన్నికల అధికారి పంపుతారు. నూతన ఓటరుగా నమోదు చేసుకోవడానికి, సవరణలు చేసుకోవడానికి సంబంధిత ఫారాలు గ్రామ స్థాయిలో ఉండే పోలింగ్‌ బూత్‌ అధికారుల వద్ద లభిస్తాయి. లేదా ఆన్‌లైన్‌ ద్వారా సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. బుధవారం నుంచి ఓటరు జాబితా సవరణ ప్రక్రియను చేపట్టారు. నూతన సంవత్సరం 2024 జనవరి 5వ తేదీ వరకు కొత్తగా వచ్చిన దరఖాస్తుల మార్పులు, చేర్పులు చేపట్టి తుది ఓటరు జాబితా ముసాయిదాను జనవరి 6న విడుదల చేస్తారు. ఈ జాబితాపై అభ్యంతరాలను 22వ తేదీ వరకు స్వీకరిస్తారు. వచ్చిన దరఖాస్తులను బూత్‌ లెవల్‌ అధికారుల బృందం పరిశీలన చేపడుతుంది. ఫిబ్రవరి 8న తుది ఓటరు జాబితాను విడుదల చేసేలా కార్యాచరణ రూపొందించి పనిచేస్తున్నారు.