ఇకపై ఈ ప్రాంతాలకు ‘ఆర్ ఆర్ ఆర్‌’ (RRR)

ఇకపై ఈ ప్రాంతాలకు ‘ఆర్ ఆర్ ఆర్‌’ (RRR)

భూసేకరణ, సామగ్రి తరలింపునకు రంగం సిద్ధం!

ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూపులు..

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో వంద కిలోమీటర్లపైనే రహదారి విస్తరణ

రీజినల్‌ రింగు రోడ్డు ఉత్తర భాగం మ్యాప్‌

గజ్వేల్‌ : ట్రిపుల్‌ ఆర్‌ (రీజినల్‌ రింగ్‌ రోడ్డు)కు సంబంధించి ఉత్తర భాగంలో చేపట్టాల్సిన భూసేకరణ, సామగ్రి తరలింపు అంశాలపై సంబంధిత అధికారులు ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరుణంలో సహజంగానే ట్రిపుల్‌ ఆర్‌ వ్యవహారంలోనూ కొంత స్తబ్దత ఏర్పడింది. ప్రస్తుతం అధికారిక కార్యక్రమాలన్నీ వేగవంతమవుతున్న నేపథ్యంలో ట్రిపుల్‌ఆర్‌ విషయంలో ముందడుగుపడే అవకాశాలు ఉన్నాయి.

ప్రస్తుతం ఈ అంశం కీలక దశకు చేరుకుంది. భూసేకరణ, రోడ్డు నిర్మాణం కోసం గుర్తించిన స్థలంలో అడ్డుగా ఉన్న విద్యుత్‌ స్తంభాలు, టవర్లు, ఇతర సామగ్రి పక్కకు తరలించే పనిపై సంబంధిత అధికారులు దృష్టి సారించారు. ఉత్తర భాగంలోని ఉమ్మడి నల్గొండ జిల్లాతోపాటు ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలోని (సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డి) పనులు జరగనున్నాయి. భూసేకరణను చేపట్టడానికి రెవెన్యూడివిజన్ల వారీగా కాలా (కాంపిటెంట్‌ అథారిటీ ఫర్‌ ల్యాండ్‌ అక్వజైషన్‌)లను ఏర్పాటు చేసిన సంగతి విదితమే.

ఇందులో భాగంగానే చౌటుప్పల్‌, యాదాద్రి, అందోల్‌-జోగిపేటతోపాటు గజ్వేల్‌, తూప్రాన్‌, భువనగిరి కాలాల పరిధిలోనూ త్రీడీ నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. మొత్తంగా ఎనిమిది కాలాల పరిధిలోని 84 గ్రామాల్లో 4700 ఎకరాల వరకు భూసేకరణ జరగనుండగా.. అత్యధికంగా గజ్వేల్‌లో 980 ఎకరాలను సేకరించనున్నారు. ఉత్తర భాగం రీజినల్‌ రింగు రోడ్డు నిడివి 158 కిలోమీటర్లు కాగా ఇందులో 100 కిలోమీటర్ల వరకు ఉమ్మడి మెదక్‌ జిల్లాలో విస్తరించనున్నది.

సామగ్రి తరలింపునకు చర్యలు ఉత్తర భాగంలో నిర్మించనున్న ట్రిపుల్‌ఆర్‌ రోడ్డు గుర్తించిన భూముల్లో అడ్డంగా ఉన్న విద్యుత్‌ స్తంభాలు, టవర్లు, ఇతర సామగ్రి తరలింపునకు చర్యలు తీసుకోనున్నాం. ఇందుకు సంబంధించిన కార్యాచరణపై కసరత్తు జరుగుతోంది. పూర్తికాగానే పనులు ప్రారంభమవుతాయి. భూసేకరణ అంశంలోనూ ముందడుగు పడనుంది. – రాహుల్‌, ఎన్‌హెచ్‌ఏఐ డిప్యూటీ మేనేజర్‌..