యాదగిరిగుట్ట :
ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తరువాత మహిళలు తమ కుటుంబ సభ్యులతో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి అధికంగా వస్తున్నారు. ఇందులో భాగంగానే గురువారం సికింద్రాబాద్‌కు చెందిన బండి నాని, మౌనిక దంపతులు తమ పిల్లలతో కలిసి యాదాద్రీశుడి దర్శనానికి ఉదయం వచ్చారు.
శ్రీస్వామివారిని దర్శించుకొని సాయంత్రం 5గంటల సమయంలో తిరిగి సికింద్రాబాద్‌కు వెళ్లేందుకు యాదగిరిగుట్ట పట్టణంలోని బస్టాండ్ వద్దకు వచ్చారు. సికింద్రాబాద్‌కు వెళ్లే బస్సులో నాని తన భార్య మౌనిక, పిల్లలతో కలిసి ఎక్కారు. ఇందులో మహిళల సీట్లలో పురుషులు కూర్చోవడంతో.. ఇది లేడిస్ సీటు.. మా పిల్లలు, భార్య కూర్చుంటుందని కొద్దిగా లేవండి అని ప్రయాణికులను కోరాడు.
ఈ సమయంలో మహిళల సీటులో కూర్చున్న పురుషులు నానితో వాగ్వాదానికి దిగారు. ఆరుగురు ప్రయాణికులు నానితో పాటు ఆయన భార్య మౌనికలను తీవ్రంగా కొట్టారు. బస్సును డ్రైవర్, కండక్టర్ పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద నిలిపి, కానిస్టేబుల్‌ను తీసుకువచ్చి గాయపడిన నాని, మౌనికలను సముదాయించారు. తనను కొట్టిన వ్యక్తులపై కేసు పెట్టమంటే.. తమనే దింపేసి వెళ్లిపోయారని నాని, మౌనిక వాపోయారు. ముఖానికి గాయమైన నానిని తన భార్య మౌనిక ఆస్పత్రికి తీసుకెళ్లింది.