బెంగళూరు :
ఓ మహిళా వ్యాపారవేత్త తన నాలుగేళ్ల కుమారుడిని గోవాలో అతి దారుణంగా హత్య చేసింది. ఎవరికీ అనుమానం రాకుండా చిన్నారి మృతదేహాన్ని బ్యాగులో దాచిపెట్టి ట్యాక్సీలో గోవా నుంచి కర్ణాటక వరకు ప్రయాణించింది. పోలీసుల తనిఖీల్లో అసలు విషయం బయట పడింది. ఈ సంఘటన జనవరి 9 (మంగళవారం) వెలుగులోకి వచ్చింది. కలంగుటే పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పరేష్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన సుచనా సేత్ (39) మైండ్‌ఫుల్ ఏఐ ల్యాబ్ అనే ఓ స్టార్టప్‌ని స్థాపించింది. ఆ కంపెనీకి ఆమె సీఈవోగా వ్యవహరిస్తోంది. 2021లో టాప్ 100 బ్రిలియంట్ ఉమెన్ ఇన్ ఏఐ ఎథిక్స్‌లో చోటు దక్కించుకుంది కూడా. గత శనివారం (జనవరి 6) ఆమె తన నాలుగేళ్ల కుమారుడిని తీసుకుని ఉత్తర గోవాలోని కాండోలిమ్ అనే హోటల్‌కు వెళ్లింది. అక్కడ రెండు రోజులు స్టే చేసిన తర్వాత ముఖ్యమైన పనినిమిత్తం బెంగళూరు వెళ్తున్నానని, తన కోసం ఓ ట్యాక్సీ మాట్లాడమని హోటల్ సిబ్బందికి చెప్పింది. అయితే అక్కడి నుంచి బెంళూరుకు వెళ్లడానికి అధిక ఖర్చు అవుతుందని, విమానంలో వెళ్లమని సిబ్బంది సలహా ఇస్తారు. కానీ సుచనా సేత్ మాత్రం తాను ట్యాక్సీలోనే వెళ్తానని పట్టుబడుతుంది.
దీంతో హోటల్ సిబ్బంది ట్యాక్సీ సిద్దం చేయడంతో జనవరి 8న ఉదయం ఆమె అందులో బెంగళూరుకు బయల్దేరింది. అనంతరం హోటల్ సిబ్బంది ఆమె స్టే చేసిన గదిని శుభ్రం చేయడానికి వెళ్లగా అక్కడ ఓ టవల్‌కు రక్తం మరకలు ఉండటం గమనించారు. దీంతో హోటల్ సిబ్బంది వెంటనే కలంగుటే పోలీసులకు సమాచారం అందించారు. హోటల్ యాజమాన్యం ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. హోటల్లో దిగినప్పుడు కుమారుడితో కలిసి కన్పించిన సుచనా, తిరిగి వెళ్లేటప్పుడు మాత్రం ఒంటరిగా కన్పించడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. అంతేకాకుండా ఆమె బయటికి వెళ్లేటప్పుడు అధిక బరువుతో ఉన్న ఓ బ్యాగ్‌ను తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. వెంటనే ఆమె వెళ్లిన ట్యాక్సీ డ్రైవర్‌కు పోలీసులు ఫోన్ చేసి సుచనాతో మాట్లాడారు. అయితే, గదిలో ఉన్న టవల్‌కు ఉన్న రక్తం మరకలు తన మంథ్లీ పీరియడ్స్ వల్ల అంటుకున్నాయని, తన కుమారుడిని మార్గో (దక్షిణ గోవా) ఫ్రెండ్ ఇంటి వద్ద వదిలేసినట్లు ఆమె చెప్పింది. అయితే సుచనా ఇచ్చిన ఫ్రెండ్ అడ్రస్ నకిలీదని తేలడంతో పోలీసుల అనుమానం బలపడింది.
గోవా పోలీసుల సూచనల మేరకు ట్యాక్సీ డ్రైవర్ ఆయమంగళలోని పోలీస్ స్టేషన్‌కు తన ట్యాక్సీని తీసుకెళ్లాడు. అక్కడి పోలీసులు సుచన సేత్‌ను నిర్భందంలోకి తీసుకుని ట్యాక్సీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఓ బ్యాగ్‌లో చిన్నారి మృతదేహం పోలీసులకు లభ్యమైంది. దీంతో కర్ణాటకలోని చిత్రదుర్గలో జనవరి 8న సుచనాను గోవా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె చిన్నారిని చంపడం వెనుక అసలు కారణం ఇంకా తెలియరాలేదు. జకార్తా (ఇండోనేషియా)లో ఉన్న సుచనా సేథ్ భర్త వెంకట్ రామన్‌కు పోలీసులు సమాచారం అందించారు.