పుష్ప సినిమాకు మించి స్కెచ్‌… గంజాయి అక్రమ రవాణా ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు!

సినిమాల ప్రభావం అందరిపై ఉంటుంది. కానీ స్మగ్గర్లపై మాత్రం.. దాని ప్రభావం కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది. పుష్ప సినిమాలో స్మగ్లర్ అయిన అల్లు అర్జున్ కొత్త కొత్త ఐడియాలతో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే.. ఇక్కడ మాత్రం రియల్ స్మగ్లర్లు గంజాయి పోలీసుల కంట పడకుండా రాష్ట్రాలు దాటిస్తున్నారు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా కొందరు డీసీఎం పైన .. మరికొందరు లారీ టైర్లలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారు. డీసీఎం వ్యాన్ లో అడుగు భాగాన..

నల్గొండ, జనవరి 8: సినిమాల ప్రభావం అందరిపై ఉంటుంది. కానీ స్మగ్గర్లపై మాత్రం.. దాని ప్రభావం కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది. పుష్ప సినిమాలో స్మగ్లర్ అయిన అల్లు అర్జున్ కొత్త కొత్త ఐడియాలతో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే.. ఇక్కడ మాత్రం రియల్ స్మగ్లర్లు గంజాయి పోలీసుల కంట పడకుండా రాష్ట్రాలు దాటిస్తున్నారు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా కొందరు డీసీఎం పైన .. మరికొందరు లారీ టైర్లలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారు. డీసీఎం వ్యాన్ లో అడుగు భాగాన గంజాయి.. పైన కూరగాయలతో తరలిస్తున్నారు. కానీ పోలీసులు ఇచ్చే ట్విస్టులతో అడ్డంగా దొరికిపోయి జైలు పాలవుతున్నారు. ఆంధ్ర నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు అక్రమంగా గంజాయి రవాణా సాగుతోంది. తెలంగాణ మీదుగా సాగుతున్న ఈ అక్రమ గంజాయి రవాణా పై పోలీసులు ఉక్కు పాదంమోపుతున్నారు. నిరంతర నిఘాను కూడా పెంచారు. దీంతో ఆంధ్ర నుంచి గుంటూరు, నాగార్జునసాగర్ మీదుగా మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్న అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను నాగార్జున సాగర్ పోలీసులు పట్టుకున్నారు. నాగార్జునసాగర్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా 330 కేజీల గంజాయి దొరికింది.

మహారాష్ట్రకు చెందిన జ్ఞానోబా అమోల్ ఘొరే లారీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో నిజామాబాద్ కు చెందిన జయపాల్ తో పరిచయం ఏర్పడింది. అయితే జయపాల్ గంజాయి సరఫరా చేస్తుంటాడు. ఆంధ్ర నుంచి మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లోని వ్యక్తులకు గంజాయి తీసుకువెళ్లి ఇస్తే లక్ష రూపాయలు ఇస్తానని జయపాల్.. డ్రైవర్ జ్ఞానోబా అమోల్ ఘోరేకు చెప్పాడు. దీంతో మహారాష్ట్రకు చెందిన తన స్నేహితులు గణపతి బసవరాజ్ సోనాల్, సంగమేశ్వర సదా శివ జంగనే, ఖయ్యూమ్ ఇషాకే మరికొందరు ముఠాగా ఏర్పడ్డారు. ఈ ముఠా ఆంధ్ర నుంచి డీసీఎం వ్యాన్ లో కూరగాయల ట్రేల అడుగు భాగంలో గంజాయిని పెట్టి పైన కూరగాయలతో తరలిస్తున్నారు. మహారాష్ట్రకు వరంగల్ మీదుగా వెళ్తే పోలీసులకు పట్టుబడతామనే భయంతో గుంటూరు, మాచర్ల మీదుగా వెళ్తుండగా సరిహద్దు చెక్ పోస్టు వద్ద నాగార్జునసాగర్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఈ ముఠా దొరికింది.

డీసీఎం వ్యాన్ లోని కూరగాయలను తనిఖీ చేయగా ప్యాక్ చేసిన గంజాయి బయటపడిందని జిల్లా ఎస్పీ చందనా దీప్తి చెబుతున్నారు. నలుగురిని అరెస్టు చేసి, 336 కేజీల గంజాయి, డీసీఎం వ్యాన్, మూడు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నామని ఆమె చెప్పారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని ఆమె తెలిపారు. అక్రమ గంజాయి,మాదకద్రవ్యాలు సరఫరా చేస్తే ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ చందనా దీప్తి అన్నారు. మాదకద్రవ్య వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉక్కుపాదంతో అణిచివేస్తామని చెప్పారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని యువతను ఆమె కోరారు. మాదక ద్రవ్యాలు, గంజాయి అక్రమ రవాణా వినియోగంపై సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని ఆమె కోరారు.