సంతానం కోసం 18 ఏళ్ల నిరీక్షణ… బిడ్డ పుట్టగానే తల్లీ…!!!

మాతృత్వాన్ని ఆస్వాదించకుండానే మృతిచెందిన బాలింత

కన్నీరు మున్నీరవుతున్న కుటుంబ సభ్యులు

కరీంనగర్ :

మాతృత్వం కోసం ఆ తల్లి కోటి కలలు కన్నది. దాదాపు 18 ఏళ్ల నిరీక్షణ అనంతరం గర్భవతి కావడంతో మురిసిపోయింది. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆ మాతృమూర్తి కన్నబిడ్డను చూడకుండానే కన్నుమూసింది. ఈ సంఘటన వేములవాడలోని నాంపల్లి ప్రైవేటు ఆస్పత్రిలో సోమవారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలు. కోనరావుపేట మండలం నిమ్మపల్లికి చెందిన చేకూట తిరుపతికి బావుసాయిపేటకు చెందిన పద్మ(35)కు 18 ఏళ్ల క్రితం వివాహమైంది. చాలా ఏళ్ల తర్వాత గర్భం దాల్చడంతో వేములవాడ మున్సిపల్‌ పరిధి గల నాంపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రతీ నెల వైద్యసేవలు పొందింది.

ఇందులో భాగంగానే ప్రసూతి కోసం ఆదివారం ఆస్పత్రికి చేరుకుంది. సోమవారం ఉదయం ఆపరేషన్‌ చేయడంతో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కొంత సమయానికి ఆమె పరిస్థితి విషమిస్తుందని వైద్యులు కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించాలని సూచించారు. వెంటనే కుటుంబ సభ్యులు కరీంనగర్‌ తీసుకెళ్లగా.. అక్కడికి చేరుకోగానే ఆమె మృతిచెందింది. దీంతో ఆమె బంధువులు నాంపల్లిలోని ప్రైవేటు ఆస్పత్రికి చేరుకుని నిరసన తెలిపారు. ఈ ఘటనపై వేములవాడ పోలీసులు విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు.