తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లడంతో ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. తన నేరం బయటపడుతుందని భావించి స్నేహితుడితో కలిసి బాలికను చంపేద్దామని ఆమె ఇంటికి వెళ్లారు.
చింతపల్లి :
తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లడంతో ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. తన నేరం బయటపడుతుందని భావించి స్నేహితుడితో కలిసి బాలికను చంపేద్దామని ఆమె ఇంటికి వెళ్లారు. ఎలాగూ హతమారుస్తున్నాం కదా అని ఇద్దరూ కలిసి మరోసారి లైంగికదాడికి పాల్పడి చంపేసిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకొంది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను బుధవారం అరెస్టు చేసినట్లు చింతపల్లి అదనపు ఎస్పీ ప్రతాప శివకిషోర్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
ఆయన వివరాల ప్రకారం..
గూడెంకొత్తవీధి మండలంలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ బాలిక తల్లిదండ్రులు ఈనెల 2న వ్యవసాయ పనులకు వెళ్లారు. దీంతో ఆటో డ్రైవర్ పాంగి రమేశ్(19) ఆమెను బెదిరించి మరో ఇంట్లోకి బలవంతంగా తీసుకెళ్లడం కొందరు చిన్నారులు చూశారు. రమేశ్ తనపై లైంగికదాడి చేసినట్లు బాలిక తన బంధువుకు చెప్పింది. ఈ విషయం గ్రామంలో అందరికీ తెలిసిపోతుందని రమేశ్ భయపడ్డాడు. తన స్నేహితుడైనా మరో ఆటోడ్రైవర్ సీతన్నకు జరిగిందంతా చెప్పాడు. బాలిక తల్లిదండ్రులు ఇంటికి వచ్చేలోగా ఆమెను చంపేద్దామని నిర్ణయించుకున్నారు.
తొలుత రమేశ్, కొంతసేపటి తర్వాత సీతన్న ఇంట్లోకి వెళ్లారు. ఎలాగూ ప్రాణాలు తీస్తున్నాం కదా అని ఇద్దరూ కలిసి మరోసారి ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం చీరతో తన గొంతుకు ముడి వేసి హత్య చేశారు. ఆత్మహత్యగా చిత్రీకరించేలా తనని దూలానికి వేలాడదీసి పరారయ్యారు. సాయంత్రం ఇంటికి వచ్చిన బాలిక తల్లిదండ్రులు తమ కుమార్తె చనిపోవడంతో కన్నీరుమున్నీరయ్యారు. మరుసటి రోజు అంత్యక్రియల్లో భాగంగా మృతురాలికి స్నానం చేయిస్తున్న సమయంలో శరీరంపై గాయాలు కనిపించాయి. తల్లిదండ్రులకు అనుమానం వచ్చినా మృతదేహాన్ని ఖననం చేశారు.
ఈనెల 5న గూడెంకొత్తవీధి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయగా.. సీఐ అశోక్ కుమార్, ఎస్సై అప్పలసూరి గ్రామానికి వెళ్లి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టారు. ఖననం చేసిన మృతదేహాన్ని రెవెన్యూ అధికారులు, వైద్యుల సమక్షంలో బయటకు తీయించి పోస్టుమార్టం పూర్తి చేశారు. ఇంతలో తమ పేర్లు బయటకు వస్తాయని భావించిన నిందితులిద్దరూ వీఆర్వో సాయంతో పోలీసుల ఎదుట లొంగిపోయారు. నిందితులపై పోక్సోతోపాటు అత్యాచారం, హత్య కేసులు నమోదు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు.