తెలంగాణలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. అయితే ఇందులో ఉచిత విద్యుత్ కోసం అర్జీ చేసుకున్న వారి పరిస్థితి ఇప్పుడు ఎరక్కపోయి ఇరుక్కునట్లుగా మారింది. ఒకవేళ ఉచితంగా కరెంట్ కావాలంటే ముందుగా ఇప్పటి వరక పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించాలి. అలా కనుక వసూలు చేస్తే ఖజానాకు రూ.6,000ల కోట్ల ఆదాయం సమకూరనుంది..
రాష్ట్రంలో ప్రజాపాలన దరఖాస్తుల్లో ఉచిత కరెంట్‌కు ఎరక్కపోయి దరఖాస్తు చేసుకుని ఇరుక్కుపోయినట్లు ఉంది కొందరి పరిస్థితి. ఉచితం కావాలంటే ముందు బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి రావచ్చు. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ బకాయిలు భారీగా పేరుకుపోయాయి. చార్మినార్ జోన్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంతకాలంగా బిల్లులు చెల్లింపు జరగడంలేదు. ప్రజాపాలన అర్జీలతోపాటు జత చేసిన విద్యుత్ బిల్లులతో ఐదేళ్లుగా బకాయి చెల్లించని కుటుంబాలు చాలా ఉన్నాయని తేలింది..
ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్‌ను అందిస్తామని ఇప్పటికే ప్రకటించిందని విద్యుత్‌శాఖ అధికారులు తెలిపారు. బిల్లులు చెల్లించని వారందరికీ ఉచిత హామీని వర్తింపజేయాలంటే బకాయిలు (Pending Electricity Bills) అడ్డొస్తాయని పేర్కొన్నారు. వినియోగదారులు వాటిని చెల్లించాలి లేదా ప్రభుత్వం బకాయిలను మాఫీ చేయాలని వివరించారు. రెండు మార్గాలూ తమకు ఆమోదయోగ్యమేనని, ఖజానాకు ఆదాయం పెరుగుతుందని అధికారులు చెప్పారు. మరోవైపు ఎల్టీ వినియోగదారుల బకాయిలు రూ.362 కోట్ల మేర పేరుకుపోయాయి. వీటిలో రాజేంద్రనగర్, చార్మినార్ సర్కిళ్ల బకాయిలే రూ.200 కోట్ల మేర ఉండటం గమనార్హం.
గ్యారంటీల అమలు జరిగేలా బడ్జెట్ రూపకల్పన కోసమే ప్రజాపాలన దరఖాస్తులు :
భట్టి విక్రమార్కప్రభుత్వ సంస్థలు సైతం… మరోవైపు ప్రభుత్వ శాఖలు చాలా కాలంగా బిల్లులు చెల్లించట్లేదు. ఒక్క జలమండలే రూ.3,100కోట్ల బకాయి పడింది. పురపాలక, విద్య తదితర శాఖల భవనాలూ చెల్లించట్లేదు.
“బిల్లులు కట్టాలా? వద్దా? : ఈ నెల బిల్లు చెల్లించాలా? వద్దా? అని వినియోగదారులు విద్యుత్‌శాఖ (Electricity Department)సిబ్బందిని అడుగుతున్నారు. అయితే ప్రభుత్వం ప్రకటించే వరకు బిల్లులు చెల్లించాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి ఇంకా మార్గదర్శకాలు విద్యుత్ సంస్థకు అందలేదని అంటున్నారు. దీంతో జనవరి బిల్లు మాత్రం కట్టాల్సిందేనని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలో దాదాపు 25 లక్షలు ఉచిత కరెంట్‌కు సంబంధించిన దరఖాస్తులే ఉన్నాయి. ప్రజాపాలన దరఖాస్తుల కంప్యూటరీకరణ ఈ నెలాఖరు వరకు జరగనుంది. అర్జీదారుల్లో 70 శాతం వరకు 100 యూనిట్ల లోపు ఉన్నట్లు ప్రాథమిక పరిశీలనలో గుర్తించారు.
ప్రజాపాలన దరఖాస్తులకు అనూహ్య స్పందన :
ప్రజాపాలన (Praja Palana in Telangana) దరఖాస్తులకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. గత నెల 28 నుంచి ఈ నెల 6 వరకు నిర్వహించిన ప్రజాపాలనలో తెలంగాణవ్యాప్తంగా 1,24,85,383 అర్జీలు వచ్చాయి. వాటిలో ఐదు పథకాల కోసం 1,05,91,636 దరఖాస్తులు రాగా, రేషన్ కార్డులు, ఇతర అంశాలపై 19,92,747 ఉన్నాయి. రాష్ట్రంలో 1,11,46,293 కుటుంబాల పరిధిలోని 16,392 పంచాయతీలు, 710 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన గ్రామ సభలను నిర్వహించారు. ప్రజాపాలనలో మొత్తం 3714 అధికార బృందాలు 44,568 కౌంటర్ల ద్వారా దరఖాస్తులు స్వీకరించారు.
దరఖాస్తుల్లోని సమాచారాన్ని మండల, మున్సిపల్ కేంద్రాల్లో కంప్యూటరీకరిస్తున్నారు..