హైకోర్టు భవన నిర్మాణం కోసం ప్రభుత్వం హరిత మేధం చేస్తున్నది.

హైకోర్టు భవన నిర్మాణం కోసం ప్రభుత్వం హరిత మేధం చేస్తున్నది.

అరుదైన వృక్షజాతులకు చెందిన 2.5 లక్షల చెట్లను, 50కి పైగా జీవజాతులను బలి చేయనున్నది.

సాగు పరిశోధనలకు అవసరమైన వందలాది ఎకరాల్లోని సారవంతమైన, వైవిధ్యమైన నేలలు ఉన్న వ్యవసాయ బయోడైవర్సిటీ భూములను ఉన్నత న్యాయస్థానం నిర్మాణానికి కేటాయించి పర్యావరణానికి తీరని నష్టం చేకూర్చేలా కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది.

ఐక్యరాజ్య సమితి లాంటి అంతర్జాతీయ సంస్థలు పర్యావరణ సంరక్షణ ధ్యేయంగా అడుగులు వేస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం జీవావరణానికి కేంద్రంగా ఉన్న వందల ఎకరాల వ్యవసాయ వర్సిటీ భూములను హైకోర్టు నిర్మాణానికి కేటాయించి జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తున్నదని పర్యావరణ పరిశోధకులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వ్యవసాయ పరిశోధనలకు కీలకం
వందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం జీవవైవిధ్యానికి, వ్యవసాయ పరిశోధనలకు కీలకమైన ప్రాంతం. దక్కన్‌ పీఠభూమిలో ఉన్న వైవిధ్యమైన వాతావరణ, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ రంగంలో వచ్చే మార్పులపై విశ్లేషణ చేయడానికి వీలుగా ఈ ప్రాంతంలో అగ్రి బయోడైవర్సిటీ పార్కును ఏర్పాటు చేశారు.

దాదాపు 2.5 లక్షల వృక్ష సంపదతో, అంతకు మించిన జీవరాశులతో నిండిన ఈ భూముల్లో హైకోర్టు కట్టాలని చూడటం ఎందుకు? అనే ప్రశ్న పర్యావరణ పరిశోధకుల్లో ఉత్పన్నం అవుతున్నది. వ్యవసాయ వర్సిటీలో 2014 నుంచి 2024 మధ్య దాదాపు 67 కొత్త వంగడాలను సృష్టించి దేశంలోనే 4వ స్థానంలో నిలిచింది. 187 రకాల అగ్రి టెక్నాలజీలను అభివృద్ధి చేయడంలో కీలకంగా పనిచేసింది.

విద్యార్థులకు అవగాహన కోసం..

పర్యావరణంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు 2008లో అప్పటి ప్రభుత్వం బయోడైవర్సిటీ పార్కును ఏర్పాటు చేసింది. దక్కన్‌ పీఠభూమిలోని భౌగోళిక స్థితిగతులకు అనుగుణంగా ఇందులోని భూములను తీర్చిదిద్దింది. 200 ఏండ్ల నాటి వంగడాలను సేకరించడంతోపాటు వాటిని పెంచుతూ భావితరాలకు అందించడంలో ఈ భూములే ప్రధాన ఆధారంగా నిలిచాయి. అప్పటి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి బయోడైవర్సిటీ పార్కు ప్రాధాన్యం గుర్తించి ఏర్పాటు చేసేందుకు సహకరించారు.

ప్రస్తుత ప్రభుత్వం ఏ అంశాలను పరిగణనలోకి తీసుకొని వ్యవసాయ వర్సిటీ భూములను హైకోర్టుకు ధారాదత్తం చేసిందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒక్క చెట్టు ఏడాదికి రూ.32 లక్షల విలువ చేసే ఆర్థిక సంపదకు కారణం అవుతుంది. అగ్రికల్చర్‌ వర్సిటీలో 6 లక్షల చెట్లు ఉండగా, బయో డైవర్సిటీ పార్కులో 2.5 లక్షల చెట్లు ఉన్నాయని వర్సిటీ వర్గాలు వెల్లడించాయి.

అదే విధంగా 20 రకాల కమ్యూనిటీ వృక్షాలు, 681 రకాల వృక్ష, మొక్క జాతులు, 400 రకాల జంతువులు, పక్షులతో జీవ వైవిధ్యం ఈ ప్రాంతంలో కొలువై ఉన్నదని చెప్తున్నారు. ఈ ప్రభుత్వానికి ఏమాత్రం అవగాహన లేకుండా భూములు సమకూర్చడం ఆందోళన కలిగిస్తుంది. ఎలాంటి సంప్రదింపులు లేకుండా వందల ఎకరాల భూములను హైకోర్టుకు ఏకపక్షంగా కేటాయించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.భూములను కేటాయించుకుంటూ పోతుంటే భవిష్యత్తులో పరిశోధనలు ఎలా సాధ్యం? ఆలోచన చేయాలని రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ వాసుదేవరావు సూచించారు.

విలువైన లంగ్‌ స్పేస్‌
హైదరాబాద్‌ నగరంలో విలువైన లంగ్‌ స్పేస్‌కు నిలయంగా ఈ వ్యవసాయవర్సిటీ ఉన్నది. ఒక్క చెట్టు ఏడాదికి రూ.32 లక్షల విలువైన ఆర్థిక సంపదను సమాజానికి అందిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలా 20 ఏండ్ల జీవిత కాలంలో ఎన్నో లక్షల కోట్ల విలువైన సంపద బయో డైవర్సిటీ పార్కు ద్వారా అందుతుందని చెప్తున్నారు.