9వ తరగతి బాలిక.,. తల్లయింది…!!!

బాగేపల్లి :

లోకమంటే ఏమిటో తెలియని పసివయసులోనే మరో పసిబిడ్డను పోషించాల్సిన దుస్థితి ఆమెకు దాపురించింది. ఆ చిన్నారి వయసు 14 ఏళ్లు, చదివేది 9వ తరగతి. తల్లి అంగనవాడి కార్యకర్త, తండ్రి రైతు. తాము ఇంటి వద్ద సక్రమంగా ఉండము కాబట్టి చదువుకు ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వ సంక్షేమ హాస్టల్‌లో ఉంచి చదివిస్తున్నారు. అదే ఆ కుటుంబానికి శాపంగా మారింది. బాలికను ఎవరో దుండగుడు లోబర్చుకోగా గర్భం దాల్చి ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చిన అమానవీయమైన సంఘటన బాగేపల్లి తాలూకాలో జరిగింది.

అందరిలో అయోమయం…

బాగేపల్లికి దగ్గరలోని బాలికల సంక్షేమ శాఖ హాస్టల్‌లో ఉంటూ బాలిక 9వ తరగతి చదువుతోంది. కడుపు నొప్పి అని బాలిక ఇటీవల ఇంటికి రాగా ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యుడు ఇంజెక్షన్‌ వేసి కొన్ని మాత్రలిచ్చారు. ఇంటికి వచ్చిన మరో రెండు గంటల్లో మళ్లీ కడుపు నొప్పి వచ్చిందని చెప్పడంతో తాలూకా ఆస్పత్రికి వెళ్లారు. వైద్యులు పరిశీలించి బాలిక నిండు గర్భిణి అని, ఇవి ప్రసవం నొప్పులు అని తెలిపారు. కాన్పు చేయగా బాలికకు మగబిడ్డ పుట్టాడు. చిన్నారి చేతిలో పసిబిడ్డను చూసిన వైద్యులు, తల్లిదండ్రులు, స్థానికులు ఏం జరిగిందోనని తీవ్ర అయోమయానికి గురయ్యారు. బాలికల హాస్టల్‌లో బాలికకు గర్భం ఎలా వచ్చిందని అటు తల్లిదండ్రులు, ఇటు వైద్యులకు అర్థం కాలేదు. బాలికకు పుట్టిన శిశువు 2.2 కేజీల బరువుంది.

పోక్సో కేసు నమోదు
వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశామని తాలూకా వైద్యాధికారి డాక్టర్‌ సి.ఎన్‌. సత్యనారాయణ రెడ్డి తెలిపారు. బాలిక తల్లి అంగనవాడి టీచర్‌ కాగా, నిత్యం ఎంతోమంది గర్భవతులు, బాలింతలకు పోషకాహారం అందిస్తూ ఆరోగ్య మెళకువలను చెబుతూ ఉంటుంది. అలాంటిది సొంత కూతురి పరిస్థితిని గమనించలేకపోవడం గమనార్హమని వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాగేపల్లి పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, హాస్టల్‌ వార్డెన్, ఇతర ఇబ్బందిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాలిక, శిశువు ఆస్పత్రిలో ఉన్నారు. వారి ఆరోగ్యానికి ఇబ్బంది లేదని వైద్యులు తెలిపారు. ఈ సంఘటన తాలూకావ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది

హాస్టల్ వార్డెన్ సస్పెండ్
ఈ ఘటనపై జిల్లా అధికారులు సీరియస్‌గా స్పందించారు. బాలిక చదువుతున్న హాస్టల్‌ వార్డెన్‌ నివేదిత, అసిస్టెంట్ శివన్నను సస్పెండ్ చేశారు. బాలిక శరీరంలో ఎలాంటి మార్పులు కనిపించలేదని వార్డెన్ నివేదిత తెలిపారు. ఆమె ఎవరితో కలిసినట్లు కూడా గమనించలేదని చెప్పారు