హైదరాబాద్లో నకిలీ మైసూర్ శాండల్ సబ్బుల తయారీ ముఠా అరెస్టు

నకిలీ మైసూర్ శాండల్ సబ్బులను తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను మలక్పేట పోలీసులు అరెస్టు చేశారు

హైదరాబాద్ :

నకిలీ మైసూర్ శాండల్ సబ్బులను తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను మలక్ పేట పోలీసులు అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో సోదాలు నిర్వహించి నకిలీ ఉత్పత్తులతోపాటు దాదాపు రూ. 2 కోట్ల విలువైన తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్కు చెందిన రాకేశ్ జైన్, మహావీర్ జైన్లను నిందితులుగా గుర్తించి వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. కర్ణాటక ప్రభుత్వానికి చెందిన కేఎస్ఈఎల్ సంస్థకు మైసూర్ శాండల్ సబ్బులపై పేటెంట్ హక్కులు ఉన్నాయి.

హైదరాబాద్ కేంద్రంగా నకిలీ మైసూర్ శాండల్ సబ్బులు మార్కెట్లోకి వస్తున్నట్లు కొన్ని రోజుల క్రితం కర్ణాటక పరిశ్రమల శాఖ మంత్రి, కేఎస్ఈఎల్ ఛైర్మన్ ఎం.బి. పాటిలు సమాచారం అందింది. దీనిపై తెలంగాణ అధికారులకు సమాచారం ఇవ్వడంతోనే తాజాగా దాడులు జరిగినట్లు తెలుస్తోంది.