ఫ్రీ డేటా ఇక లేనట్లే… త్వరలో 5జీకి ఛార్జీలు
5జీ సేవల కోసం ఎయిర్‌టెల్, జియో త్వరలో రుసుములు వసూలు చేయనున్నాయి. ఈ ఏడాది రెండో అర్ధభాగం నుంచి ఛార్జీలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
దేశంలో 5జీ సేవలు ప్రారంభమై ఏడాది పూర్తయ్యింది. ఎయిర్‌టెల్, జియో మాత్రమే ప్రస్తుతానికి అత్యాధునిక సాంకేతికత కూడిన సేవలను అందిస్తున్నాయి.
ప్రస్తుతం 5జీ మొబైల్ ఉన్న వారికి 5జీ నెట్‌వర్క్ ఉన్న ప్రాంతాల్లో ఉచితంగానే డేటా సేవలను ఇస్తున్నాయి.
పైగా డేటా వినియోగంపై ఎలాంటి పరిమితీ విధించడం లేదు. ఒకవేళ మీరూ ఈ సేవలను వినియోగిస్తున్నట్టయితే.. ఇక కొన్ని రోజులు మాత్రమే! ఉచిత డేటాకు కాలం చెల్లినట్లే!! 5జీ సేవలకు ఈ రెండు టెలికాం సంస్థలూ రుసుములు వసూలు చేయనున్నాయి.
ఈ ఏడాది రెండో అర్ధభాగం నుంచి ఛార్జీలు వసూలు చేసే యోచనలో ఉన్నట్లు ‘ఎకనమిక్ టైమ్స్’ ఓ కథనంలో పేర్కొంది. ప్రస్తుతం ఎయిర్‌టెల్, జియో కంపెనీలు 4జీ ప్రీపెయిడ్ ప్లాన్లపైనే 5జీ సేవలనూ అందిస్తున్నాయి. ఇకపై 4జీ సేవలతో పోలిస్తే 5జీ కోసం 5-10 శాతం అధికంగా ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 5జీ సేవల కోసం చేసిన ఖర్చును రాబట్టుకోవడం కోసం రెండు టెలికాం సంస్థలూ ఇదే విధానాన్ని అనుసరించే అవకాశం ఉందని అనలిస్టులు భావిస్తున్నారు.
రెండు టెలికాం సంస్థలు ప్రస్తుత మొబైల్ టారిఫ్ ధరలను సైతం 20 శాతం మేర పెంచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దేశంలో ఎయిర్‌టెల్, జియో తమ 5జీ సేవలను వేగంగా విస్తరిస్తున్నాయి. రెండు సంస్థలకు కలిపి 5జీ వినియోగారుల సంఖ్య 12 కోట్లు దాటింది. ఈ ఏడాది చివరికి నాటికి ఈ సంఖ్య 20 కోట్లు దాటుతుందని అంచనా. మరో ప్రైవేటు టెలికాం సంస్థ వొడాఫోన్ ఇప్పటి వరకు 5జీ సేవలు ప్రారంభించిన దాఖలాల్లేవు.
ఇక ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ ఇప్పటికీ 4జీనే పూర్తి స్థాయిలో విస్తరించలేదు. ఇక 5జీ సేవలు ఎప్పటికి అందుబాటులోకి వచ్చేదీ చెప్పడం కష్టం. అయితే, ఎయిర్‌టెల్, జియో 5జీకి ఛార్జీలు వసూలు చేసినా ఇప్పుడున్న డేటా పరిమితికి 30-40 శాతం అధిక డేటాను తమ ప్యాక్స్‌లో అందించే అవకాశం ఉందని అనలిస్టులు చెబుతున్నారు.