వృద్దురాలి మిస్సింగ్ కేసు… పోలీసులు విచారణ జరపగా… వెలుగులోకి షాకింగ్ నిజం…!

బస్టాండ్‌లు, దుకాణ సముదాయాల వద్ద ఒంటరి మహిళలు కనిపిస్తే చాలు. మాయమాటలు చెప్పడం హత్యలు, దోపిడి చేయడం. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో వెలుగులోకి వచ్చిన ఓ ఆటో డ్రైవర్ ఆరాచకాలు. ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలే లక్ష్యంగా దోపిడికి పాల్పడుతున్న ఆటో డ్రైవర్ వరికుప్పల వెంకటేష్, సహయకురాలు అలివేలును పోలీసులు అరెస్టు చేశారు

వృద్ధురాలు హత్యతో వెలుగులోకి సీరియల్ క్రైమ్స్…

రెండు రోజుల క్రితం అదృశ్యమైన కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామానికి చెందిన వృద్ధురాలి హత్యతో వీరిద్దరి నేరాల చిట్టా బయటకు వచ్చింది. తర్నికల్ గ్రామానికి చెందిన నాగమ్మ వంగూరు మండలం ఉల్పర గ్రామంలో ఉన్న కోడలు ఇంటికి వెళ్లేందుకు కల్వకుర్తి బస్టాండ్‌కు వచ్చింది. బస్ కోసం ఎదురుచూస్తున్న క్రమంలో ఆటో డ్రైవర్ వెంకటేష్, అలివేలు వృద్ధురాలితో మాటామాట కలిపి ఉల్పరకు వెళ్తున్నామని నమ్మబలికి ఆటోలో తీసుకెళ్లారు. అచ్చంపేట నియోజకవర్గం మన్ననూర్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి గొంతుకోసి వృద్ధురాలిని హత్య చేశారు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న అభరణాలు అపహరించకుని వెళ్లారు. సమయం గడుస్తున్నా నాగమ్మ ఇంటికి రాకపోవడంతో విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. కల్వకుర్తి బస్టాండ్‌లోని సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించి నిందితులను గుర్తించారు.

కల్వకుర్తిలో అనుమానస్పదంగా తిరుగుతూ పోలీసులకు చిక్కిన నిందితులు..

కల్వకుర్తి పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో ఈ ఇద్దరు నిందితుల అనుమానాస్పద కదలికలను పోలీసులు గమనించి అదుపులోకి తీసుకుని విచారించారు. కల్వకుర్తిలో అదృశ్యమైన నాగమ్మ హత్యతో పాటు మరో హత్య, దోపిడీ కేసును నిందితులు ఒప్పుకున్నారు. కల్వకుర్తికి చెందిన వరికుప్పల వెంకటేశ్, తెలకపల్లి మండలం వట్టిపల్లికి చెందిన కల్మూరి అలివేలును మీడియా ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. అయితే కల్వకుర్తిలో నాగమ్మ హత్యతో పాటు ఉప్పునూంతల మండలానికి చెందిన బాలకిష్టమ్మ మిస్సింగ్ కేసు సైతం హత్యగా తేలింది. కడ్తాల్‌లో మరో దోపిడీ కేసులోనూ వీళ్లే నిందితులుగా తేల్చారు పోలీసులు. ఇద్దరు నిందితుల నుంచి నాలుగు లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు, కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. నాలుగు నెలలుగా ఈ హత్యలు, దోపిడికి పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. కల్వకుర్తి పట్టణంలో ఆటో నడుపుతూ వివిధ ప్రాంతాల్లో ఒంటరి మహిళలు, వృద్ధులను టార్గెట్ చేసుకొని ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు.