తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ప్రమాద బీమా పెంపు… RTC ఎండి సజ్జనార్

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ప్రమాద బీమా పెంపు… RTC ఎండి సజ్జనార్

హైదరాబాద్ :

తమ ఉద్యోగులకు టీఎస్‌ఆర్టీసీ ప్రమాద బీమా పెంచింది. రూ.40 లక్షలు ఉన్న ప్రమాద బీమాను రూ.1.12 కోట్లకు పెంచుతూ యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో ఒప్పందం చేసుకుంది.

హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో ప్రమాద బీమా పెంపుపై టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, యూబీఐ సీజీఎం అండ్ జోనల్ హెడ్ భాస్కర్ రావు శనివారం ఒప్పందం చేసుకున్నారు. ఫిబ్రవరి 1 వ తేది నుంచి ఈ ప్రమాద బీమా అమల్లోకి వస్తుంది.

ఈ సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ మాట్లాడు తూ.. ఎలాంటి ప్రీమియం చెల్లింపు లేకుండా రూ.1.12 కోట్ల వరకు ప్రమాద బీమాను పెంచడం శుభపరిణామమని అన్నారు.

రోడ్డు ప్రమాదాల్లో అకాల మరణం చెందిన, శాశ్వతంగా దివ్యాంగులైన సిబ్బంది కుటుంబాలకు ఇది ఎంతో ఉపయోగపడు తుందని చెప్పారు. ప్రమాద బీమాను పెంచాలని కోరగానే అంగీకరించిన యూబీఐ ఉన్నతాధి కారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

యూబీఐ సూప‌ర్ శాల‌రీ సేవింగ్ అకౌంట్ కింద రోడ్డు ప్రమాదాల్లో మరణించిన 12 మంది సిబ్బంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.40 లక్షల చొప్పున అందజేశామని తెలిపారు.

గతంలో శాలరీ శ్లాబులతో ప్రమాద బీమా ఇచ్చేవారని, ఈ కొత్త ఒప్పందంలో శాలరీ శ్లాబులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క సిబ్బందికి రూ.ఒక కోటి ప్రమాద బీమా వర్తిస్తుందని తెలిపారు. రూపే కార్డు ఉంటే మరో రూ.12 లక్షల బీమా అందుతుందని వివరించారు.

సిబ్బంది, ఉద్యోగుల శాల‌రీ అకౌంట్స్‌ను రెండేళ్ల క్రితం యూబీఐకి టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం మార్చిందని సజ్జనార్‌ తెలిపారు. ఈ ఖాతా ద్వారా ఉచిత ప్రమాద బీమా సౌక‌ర్యం ఉందని చెప్పారు.

ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబ స‌భ్యుల‌కు సంస్థ ఈ స్కీమ్‌ అండ‌గా నిలుస్తోందని, వారు ఆత్మ స్థైర్యం, ధైర్యం కోల్పోకుండా ఉండేందుకు బాధిత కుటుంబానికి ఆసరాగా నిలుస్తుందన్నారు.

యూబీఐ ఉచిత ప్రమాద బీమాపై సిబ్బందికి అవగాహన కల్పించాలని అధికారులకు సజ్జనార్‌ సూచించారు.