గొర్రెల పంపిణీలో రూ.2.20 కోట్ల స్కాం!పశుసంవర్ధక శాఖలో అక్రమాలపై ACB కేసు

హైదరాబాద్‌ :

BRS ప్రభుత్వ హయాంలో చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకున్నదని తెలుస్తోంది. ఈ మేరకు పశుసంవర్ధక శాఖలో జరిగిన అక్రమాలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. గొర్రెల పెంపకం దారులకు ప్రభుత్వం సబ్సిడీ ధరలపై యూనిట్‌లను అందజేసిన సంగతి తెలిసిందే. అయితే.. గొర్రెల పంపిణీదారుల పేరుతో అధికారులు నిధులు స్వాహా చేశారని ఏసీబీ గుర్తించింది. వాటిని నకిలీ ఎకౌంట్లలోకి మళ్లించినట్టు తేల్చారు. 133 యూనిట్లకు చెల్లించాల్సిన నిధులు పక్కదారి మళ్ళినట్లు గుర్తించారని తెలిసింది.

దీనిపై విచారణకు దిగిన ఏసీబీ అధికారులు మాసబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ కార్యాలయంలో సోదాలు చేయగా.. కీలక కంప్యూటర్‌ హార్డ్‌ డిస్క్‌లు మాయమైనట్టు గుర్తించారని సమాచారం. కొన్ని కీలక ఫైళ్లు కూడా కనిపించడం లేదని చెబుతున్నారు. మొత్తంగా రూ.2.20 కోట్ల మేరకు కుంభకోణం జరిగిందని ఏసీబీ అధికారులు గుర్తించినట్టు తెలిసింది. ఏసీబీకి కొత్త ప్రభుత్వంలో ఇదే తొలి కేసు. దీనిపై సైబరాబాద్‌ పరిధిలోని గచ్చిబౌలి పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అయితే.. దానితో సమాంతరంగా ఏసీబీ అధికారులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పలు కీలక ఆధారాలు ఏసీబీకి లభ్యమైనట్టు తెలుస్తోంది.