బాలికలతో విమాన అటెండెంట్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. వారికి తెలియకుండా టాయిలెట్‌లో సెల్‌ఫోన్ పెట్టి చిత్రీకరించాడు. అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
స్థానిక మీడియా కథనాల ప్రకారం..
ఎస్టేస్ కార్టర్ థాంప్సన్ అమెరికా ఎయిర్‌లైన్స్ విమానంలో అటెండెంట్‌గా పని చేస్తున్నాడు. గతేడాది సెప్టెంబరులో నార్త్ కరోలినా నుంచి మసాచుసెట్స్‌కు విమానం బయలుదేరింది. టేకాఫ్ అయిన కాసేపటికి ఓ బాలిక టాయిలెట్‌కు వెళుతుండడాన్ని గమనించాడు. ముందే టాయిలెట్‌లోకి వెళ్లి అందులో తన ఫోన్‌ను రహస్యంగా ఏర్పాటు చేశాడు. అనంతరం బయటకు వచ్చి సీటు విరిగిపోయిందని ఆమెతో చెప్పాడు. లోపలికి వెళ్లిన బాలిక ఫోన్‌ను గమనించి దాన్ని ఫొటో తీసి తల్లిదండ్రులకు చూపించింది. అనంతరం ఆమె తండ్రి.. థాంప్సన్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించగా అతడు టాయిలెట్‌లోకి వెళ్లి గడియ వేసుకొని ఫోన్‌లోని డేటాను తొలగించాడు. అప్రమత్తమైన తల్లిదండ్రులు విమాన కెప్టెన్‌కు ఈ విషయాన్ని తెలియజేశారు. విమానం ల్యాండ్ అయిన అనంతరం పోలీసులు ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా నిందితుడిని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు అరెస్టు చేశారు. విచారణలో అతడి అకృత్యాలు వెలుగులోకి వచ్చాయి. చాలా మంది బాలికల వీడియోలను తీసినట్లు విచారణలో తేలింది. దీనిపై అమెరికన్ ఎయిర్‌లైన్స్ స్పందించింది. తాము ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యం అన్న ఎయిర్‌లైన్స్.. ఈ ఘటన తర్వాత అతడిని విధుల నుంచి తొలగించినట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. నేరం రుజువైతే నిందితుడికి 2 లక్షల డాలర్లకు పైగా జరిమానాతో పాటు 50 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.