బాలుడి ప్రాణంతీసిన మూఢనమ్మకం.. క్యాన్సర్ తగ్గుతుందని

బాలుడి ప్రాణంతీసిన మూఢనమ్మకం… క్యాన్సర్ తగ్గుతుందని.

కాలం మారింది టెక్నాలజీ పెరిగింది. ఏం కావాలన్నా అరక్షణంలో ఇంటి గుమ్మం ముందుకి వచ్చే యుగంలో ఉన్నాం. కానీ.. ఇంకా కొందరుమాత్రం మూఢనమ్మకాల మాయలో పడి మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. జబ్బు చేస్తే.. వైద్యుడికి చూపించి మందులు వాడాల్సింది పోయి.. ఎవరో చెప్పింది గుడ్డిగా నమ్మి దాన్నే పాటించారు. ఫలితంగా ఐదేళ్ల బాలుడి ప్రాణం పోయింది. మూఢనమ్మకానికి బాలుడి ప్రాణం బలైంది. ఈ ఘటన ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో జరిగింది.

బుధవారం (జనవరి24) జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీకి చెందిన ఐదేళ్ల బాలుడు బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. ఎంతమంది వైద్యులకు చూపించినా ఫలితం లేదు. తాము కాపాడలేమని డాక్టర్లు చేతులెత్తేశారు. ఎలాగైనా తమ బిడ్డను కాపాడుకోవాలన్న తాపత్రయంతో.. ఎవరో చెప్పిన సలహాతో.. గంగలో ముంచితే రోగం నయం అవుతుందని భావించారు.

బాలుడిని తీసుకుని తల్లిదండ్రులు, బాలుడి మేనత్త హరిద్వార్ కు బయల్దేరారు. గంగానది వద్ద ఒకవైపు తల్లిదండ్రులు ప్రార్థనలు చేస్తుంటే.. మరోవైపు బాలుడి అత్త అతడిని చల్లగా ఉన్న గంగానదిలో ముంచింది. ఎంతసేపటికీ బాలుడిని నీటిలో నుంచి బయటకు తీయలేదు. ఇదంతా గమనించిన వారు ఆమెను అడ్డుకోగా.. వారిపై ఎదురుదాడి చేసింది. ఆమెను వారించి.. బాలుడిని నదిలో నుంచి బయటకు తీసి వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే బాలుడు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.