హైదరాబాద్ :
బ్యూటీ పార్లర్ ఫ్రాంచైజీలు ఇప్పిస్తానని నమ్మించిన దంపతులు రాష్ట్రవ్యాప్తంగా వందలాది మందికి రూ.2 కోట్లకుపైగా కుచ్చుటోపీ పెట్టారు. బాచుపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో వెలుగుచూసిన ఈ మోసంతో సంబంధమున్న ఇద్దర్ని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ముగ్గురు పరారీలో ఉన్నారు. ఇతర జిల్లాల్లో ఇప్పటికే కేసులు నమోదయ్యాయని తెలిపారు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. తమిళనాడుకు చెందిన షేక్ ఇస్మాయిల్(40), భార్య సమీనా అలియాస్ ప్రియాంక అలియాస్ ప్రేమకుమారి (36)లు నగరానికి వచ్చి నిజాంపేటలోని ప్రగతినగర్ నెమలి బొమ్మల చౌరస్తాలో రెండేళ్ల క్రితం ‘రోస్ గోల్డ్ బ్యూటీ పార్లర్’ ఏర్పాటు చేశారు. దంపతులతోపాటు సమీనా చెల్లెలు దేవకుమారి అలియాస్ జెస్సికా, సోదరుడు రవి అలియాస్ చిన్నా బ్యూటీ పార్లర్ యజమానులుగా వ్యవహరించేవారు. నగరానికి చెందిన విశ్వతేజను ఉద్యోగిగా చేర్చుకున్నారు. బ్యూటీ పార్లర్ విభాగంలో తమ సంస్థకు మంచి పేరుందని, ఫ్రాంచైజీలు ఇచ్చి అవసరమైన సరకులు ఇవ్వడంతోపాటు నెలకు రూ.35 వేల చొప్పున వేతనం ఇప్పిస్తామని ప్రచారం చేశారు. నిజాంపేట వాసులతోపాటు మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల నుంచి వందలాది మంది ఫోన్‌లో సంప్రదించారు. ఫ్రాంచైజీ ఇవ్వడానికి రూ.3 నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేశారు. సుమారు 200 మంది వరకు డబ్బు చెల్లించారు.
డబ్బు వచ్చాక ఖేల్ ఖతం
ఏడాదిగా అందినకాడికి డబ్బు వసూలు చేసి.. గతేడాది సెప్టెంబరు వరకు ఫ్రాంచైజీ ఇస్తామని సాగదీశారు. బాధితులకు అనుమానమొచ్చి రెండ్రోజుల క్రితం ప్రగతినగర్‌లోని కార్యాలయానికి రాగా బోర్డు లేదు. ఆరా తీయగా ఖాళీ చేసి పరారైనట్లు తెలుసుకున్నారు. బాధితుల ఫిర్యాదుతో బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. దేవకుమారితోపాటు సంస్థ ఉద్యోగి విశ్వతేజను అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సమీనా దంపతులతోపాటు ఆమె సోదరుడు రవి పరారీలో ఉన్నట్లు ఎస్సై మహేష్‌గౌడ్ తెలిపారు.