గురుకులాల పనితీరుపై సమీక్షించండి
సమీక్షించి విద్యార్థుల ప్రాణాలను కాపాడండి.
విద్యార్థినుల వరుస ఆత్మహత్యలు తీవ్రంగా కలచివేస్తున్నాయి.
విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించడానికి కౌన్సిలర్ల సంఖ్యను పెంచండి.
ప్రభుత్వం నిర్లక్ష్యపూరిత వైఖరిని వీడాలి.
ఆత్మహత్య చేసుకున్న సూర్యాపేట జిల్లా ఇమాంపేట ఎస్సీ హాస్టల్ విద్యార్థిని కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత.
ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎమ్మెల్సీ కవిత.
గురుకుల పాఠశాలల్లో విద్యార్థినుల వరుస ఆత్మహత్యలు కలచివేస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే దీనిపై దృష్టి సారించి గురుకుల పాఠశాలల పనితీరుపై సమీక్షించి ఆడబిడ్డల ప్రాణఆలను కాపాడాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. పరీక్షల సమయం కాబట్టి విద్యార్థుల మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు కౌన్సిలర్ల సంఖ్యను పెంచాలని సూచన చేశారు.
ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఇమాంపేట ఎస్సీ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని అస్మిత కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు., సూర్యపేట జిల్లా మోతె మండలంలోని బుర్కచెర్ల గ్రామంలో ఆస్మిత తల్లిని, కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తో కలిసి ఎమ్మెల్సీ కవిత పరామర్శించి ఓదార్చారు. ఆర్థిక సాయం చేశారు. కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ప్రకటించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ…. ఎస్సీ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని అస్మిత ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. అదే పాఠశాలలో కొద్దికాలం క్రితం మరొక విద్యార్థిని కూడా ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని ప్రస్తావించారు. రెండు వారాల క్రితం భువనగిరి గురుకుల పాఠశాలలోనూ ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. ఇలా ఆడపిల్లల వరుస ఆత్మహత్యలు తనను కలచివేశాయని చెప్పారు.
గురుకుల పాఠశాలల్లో ఏం జరుగుతోందో అన్నదానిపై సమీక్ష చేయాలని చేతులు జోడించి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మరీ ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులు పరీక్షల ఒత్తిడితో ఉన్నారా అన్నది కూడా ప్రభుత్వం ఆలోచించన చేయాలని సూచించారు. గురుకులాలను ఏర్పాటు చేసి లక్షలాది మంది పిల్లలను చదివిపిస్తున్న నేపథ్యంలో ఇలాంటి వరుస సంఘటనల జరుగుతుంటే ఆందోళన కలిగిస్తుందని స్పష్టం చేశారు. ఆడపిల్లలు సున్నితంగా ఉంటారు కాబట్టి ఆత్మహత్య చేసుకునేంత స్థాయికి ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు ? సిలబస్ బాగలేదా ? కౌన్సిలర్ల సంఖ్య తక్కువగా ఉందా ? మరే సౌకర్యాల కొరత ఉందా ? సమయానికి నాణ్యమైన ఆహారం అందుతుందా ? వంటి అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం విద్యా శాఖకు పూర్తి స్థాయి మంత్రి లేరు కాబట్టి సమీక్ష చేయడానికి స్వయంగా ముఖ్యమంత్రియే చొరువ తీసుకోవాలని సూచించారు. పరీక్షల సమయం విద్యార్థుల మానసిక ఒత్తిడిని తొలగించే విధంగా కౌన్సిలర్ల సంఖ్యను పెంచాలని పేర్కొన్నారు. అలాగే, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మార్కులు, ర్యాంకులు అంటూ ఒత్తిడి చేయవద్దని కోరారు.
అయితే, విద్యార్థినుల ఆత్మహత్యల సంఘటనల్లో దర్యాప్తు ముందుకు సాగడం లేదని ఆక్షేపించారు. భువనగిరి సంఘటనతో పాటు ఇమాంపేట హాస్టల్ విద్యార్థుల ఆత్మహత్యలపై సమగ్ర దర్యాప్తు జరిపించడానికి కమిటీని నియమించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్లక్షపూరిత వైఖరిని వీడాలని స్పష్టం చేశారు.