రోడ్డు ప్రమాద బాధితులకు వరం ఈ పథకం… రూ.1.50 లక్షల వరకూ వైద్యం ఉచితం…
రోడ్డు ప్రమాదాలు, వాటి వల్ల చనిపోయిన వారి గురించి మనం రోజూ వింటూ ఉంటాం. అంతెందుకు మనం రోడ్డుపై ప్రయాణం చేస్తుండగా, మన ముందో, వెనుకనో ఇలాంటి జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి మనకు బాగా తెలిసిన వారే ప్రమాదాల బారిన పడుతుంటారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన వ్యక్తికి వైద్య సహాయం అందడం చాలా ముఖ్యం. అప్పుడే అతడి ప్రాణం నిలబడుతుంది. సరిగ్గా దీనిపైనే కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్సను అందించేందుకు కొత్త పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా బాధితులకు ఆస్పత్రుల్లో అన్ని రకాల చికిత్సలు అందుతాయి. ఛండీగఢ్ లో పైలట్ ప్రాజెక్టుగా దీనిని అమలు చేస్తోంది. ఈ పథకం గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు..
దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ ఘటనల్లో అనేక మంది బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. చాలామంది తీవ్ర గాయాల పాలై మంచం మీద గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాద ఘటనల్లో మరణాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీని కోసం పైలట్ ప్రాజెక్టుగా కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి దీని ద్వారా నగదు రహిత చికిత్స అందుతుంది. సమయానికి బాధితులకు చికిత్స అందించడం వల్ల వారికి ప్రాణాలను కాపాడవచ్చు. అలాగే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఉంటుంది.
డబ్బులు తీసుకోకుండా చికిత్స ..
రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స అందించే పైలట్ ప్రోగ్రామ్ ను రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) అభివృద్ధి చేసింది. బాధితులకు తక్షణమే వైద్య సాయం అందించి, వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నిస్తుంది. రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక మరణాలు సంభవించే దేశాల్లో ప్రస్తుతం మనదేశం అగ్రస్థానంలో ఉంది. ప్రభుత్వ నివేదికల ప్రకారం 2022లో దేశంలో సుమారు 1.68 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారు.
వైద్యసేవలు అందిస్తారిలా..
పైలట్ ప్రోగ్రామ్ ద్వారా రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.1.5 లక్షల వరకూ నగదు రహిత చికిత్స అందుతుంది. ప్రమాదం జరిగిన నాటి నుంచి దాదాపు ఏడు రోజుల వరకు అమలులో ఉంటుంది. రోడ్డు ప్రమాదం జరిగి, బాధితుడు తీవ్రంగా గాయపడినప్పుడు అతడిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించాలి. ఆ సమయాన్నే గోల్డెన్ అవర్ అని పిలుస్తారు. ఈ గోల్డెన్ అవర్ లో బాధితుడికి వైద్య చికిత్స అందితే అతడి ప్రాణాలు నిలిచే అవకాశం ఎక్కువ. కానీ దేశంలో ఇలా జరగకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాల కేసుల్లో మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి.
ఎక్కడ ప్రమాదం జరిగినా..
జాతీయ రహదారులు, ఆర్అండ్ బీ, ఇతర ఏ రకమైన రోడ్లపై ప్రమాదం జరిగినా నగదు రహిత చికిత్స అందిస్తారు. దీనిలో ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. నిబంధనల మేరకు బాధితులందరికీ ఆస్పత్రి ల్లో చికిత్స చేస్తారు. ఈ కార్యక్రమం కింద రోడ్డు ప్రమాద బాధితులకు చికిత్స చేసే ఆసుపత్రులు మోటారు వాహన ప్రమాద నిధి నుంచి డబ్బులను రీయింబర్స్ చేసుకుంటాయి.
ఎన్ హెచ్ ఏ ద్వారా అమలు..
నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్ హెచ్ఏ) ద్వారా ఈ పైలట్ ప్రోగ్రామ్ అమలు జరుగుతుంది. దీన్ని క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయడానికి పోలీసులు, ఆస్పత్రులతో సమన్వయం కలిగి ఉంటుంది. ఈ పథకంలో వైద్య చికిత్స, ఇతర సేవల కోసం డిజిటల్ ప్లాట్ ఫాంలో ప్రమాదం జరిగిన తీరు, బాధితుల పరిస్థితిపై వివరణాత్మక నివేదిక ఉంటుంది. ప్రస్తుతం చండీగఢ్‌లో ఈ పైలట్ ప్రోగ్రామ్ ను ప్రారంభించారు. అక్కడ వచ్చిన ఫలితాల ఆధారంగా దేశంలోని మిగిలిన ప్రాంతాలకు విస్తరించనున్నారు.
మరణాలను తగ్గించడమే లక్ష్యం..
ప్రపంచ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య మన దేశంలోనే ఎక్కువ. 2022లో మన దేశంలో 4.61 లక్షలకు పైగా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీటిలో 1.68 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 4.43 లక్షల మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. దీని ద్వారా ప్రమాదం జరిగిన తర్వా త గోల్డెన్ అవర్ లో బాధితులకు ఆస్పత్రిలో వైద్య చికిత్స అందించి, అతడి ప్రాణాలను కాపాడవచ్చన్నారు. 2030 నాటికి రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను సగానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.