అలా ప్రకటన ఇలా… తనిఖీలు షురూ…

హైదరాబాద్‌ :

లోక్‌సభ ఎన్నికల కోసం రాజధాని పోలీసు విభాగం పూర్తిస్థాయిలో సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన వెలువడిన వెంటనే మూడు కమిషనరేట్లలో తనిఖీలు ప్రారంభించారు. శివారు ప్రాంతాలు, వ్యూహాత్మక రహదారుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఇవిగాకుండా ప్రత్యేక పికెట్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం మూడు కమిషనరేట్లలో కలిపి 8,290  పోలింగ్‌ కేంద్రాలున్నాయి. వీటిలో 2 వేల దాకా సమస్యాత్మకమైనవి.  హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ ఉన్నతాధికారులు ఎన్నికల నిర్వహణ, బందోబస్తు, తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందితో సమీక్షించారు. త్వరలో మరో విడత సమావేశమవనున్నారు.

50 వేల మందితో భద్రత..

ఈసారి ఎన్నికలకు నగరంలో సుమారు 50 వేల మంది బందోబస్తు పాల్గొంటారని అంచనా. మూడు కమిషనరేట్ల సిబ్బంది, ఏఆర్‌, టీఎస్‌ఎస్పీ, కేంద్ర బలగాలతో కలిపి ఈ సంఖ్య ఉండనుంది. ప్రస్తుతం ఠాణాల వారీగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో కేంద్ర బలగాలు పాల్గొంటాయి. ఇప్పటికే హవాలా మార్గాల్లో నగదు తరలింపు, మద్యం అక్రమ రవాణాపై అధికారులు దృష్టిసారించారు. లోక్‌సభ నియోజకవర్గ సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు.

హవాలా డబ్బుపై  కన్ను..

ఎన్నికలు ఎప్పుడైనా నగరంలోనే పెద్దమొత్తంలో డబ్బు పట్టుబడుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి హవాలా మార్గంలో వచ్చే సొమ్ములో మెజార్టీ నగరానికే చేరుతుంటుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో టాస్క్‌ఫోర్స్‌, రాచకొండ, సైబరాబాద్‌లో ఎస్‌వోటీ విభాగాలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. అక్రమ మార్గంలో లెక్కల్లో లేని డబ్బు తరలింపుపై దృష్టి పెట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.