వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేయించిందో మహిళా SI…

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేయించిందో మహిళా SI…

ఆ తర్వాత కేసును తప్పుదోవ పట్టించేందుకు కూడా ఆమె ప్రయత్నించింది….

తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా కల్లావి ప్రాంతానికి చెందిన 48ఏళ్ల సింథిల్ కుమార్‌ గతంలో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేసేవారు. డ్యూటీలో అనేక అక్రమాలకు పాల్పడటంతో చాలా ఏళ్ల క్రితమే పోలీస్ ఉద్యోగం పోయింది. అప్పటి నుంచి ట్యాక్సీ నడుపుతున్నాడు. అతడి భార్య 44 ఏళ్ల చిత్ర సింగారపేట పీఎస్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్నారు. వీరికి 19ఏళ్ల జగదీప్‌ కుమార్‌ అనే కుమారుడు ఉన్నాడు. సెప్టెంబర్ 16 నుంచి సింథిల్ కుమార్ కనిపించకపోవడంతో అతడి తల్లి కలెక్టరేట్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది. పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టగానే ఎస్‌ఐ చిత్ర కేసును తప్పుదోవ పట్టించేందుకు తన కుమారుడు జగదీప్‌కుమార్‌, తన కారు డ్రైవర్‌ కమల్‌రాజ్‌( వయసు 37)ను పోలీసుల ముందు లొంగిపోవాల్సిందిగా సలహా ఇచ్చింది. దాంతో వారిద్దరి హత్య చేసింది తామేనని పోలీసుల ముందు లొంగిపోయారు. కానీ, ఈ హత్య వెనుక చిత్ర ప్రమేయం కూడా ఉందని భావించిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. హత్య కోసం కిరాయి హంతకులను సమకూర్చిన జ్యోతిష్యురాలు సరోజను పోలీసులు అరెస్ట్ చేయడంతో చిత్ర పాత్ర కూడా బయటకు వచ్చింది.

ఎస్‌ఐ చిత్ర, ఆమె కారు డ్రైవర్‌ కమల్‌రాజ్‌కు మధ్య సంబంధం ఉన్నట్టు తెలియడంతో సింథిల్‌ కుమార్ తన భార్య చిత్రను గట్టిగా హెచ్చరించారు. పదేపదే ఈ విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భర్తను అడ్డుతొలగించుకోవాలని భావించిన చిత్ర.. తనకు పరిచయం ఉన్న జ్యోతిష్యురాలు సరోజను సంప్రదించింది. 10 లక్షలు ఇస్తే తాను కిరాయి ముఠాను సమకూరుస్తానని సరోజ చెప్పడంతో చిత్ర డబ్బు చెల్లించింది. అలా కిరాయి హంతకులను మాట్లాడి వారి సాయంతో సింథిల్ కుమార్‌ను కిడ్నాప్ చేయించి అదే రోజు హత్య చేసి ముళ్ల పొదల్లో పడేశారు. కుళ్లిన పరిస్థితుల్లో ఉన్న డెడ్‌ బాడీని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఎస్‌ఐ చిత్ర, జ్యోతిష్యురాలు సరోజ, ఎస్‌ఐ కారు డ్రైవర్‌ కమల్ రాజ్‌, ఆమె కుమారుడు జగదీప్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హంతక ముఠా కోసం గాలిస్తున్నారు.