వేసవి సెలవులు వస్తున్నాయ్… రెండు నెలల ముందుగానే అన్ని ట్రైన్ టికెట్లు క్లోజ్
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రమవుతున్నాయి. దీంతో ఈసారి ముందుగానే వేసవి సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలకు కాస్త ముందుగానే వేసవి సెలవులు ప్రకటించే అవకాశం ఉంది.
ఇప్పటికే ఏపీలో మార్చి 18 నుంచి, తెలంగాణలో మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు ప్రారంభమయ్యాయి. ఏపీలో ఏప్రిల్ 24 నుంచి జూన్ 13 వరకు అంటే దాదాపు 50 రోజులపాటు సెలవులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. గత ఏడాది మే 1 నుంచి జూన్ 11 వరకు పిల్లలకు వేసవి సెలవులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక తెలంగాణలోనూ ఒకటి రెండు రోజులు అటూ ఇటుగా వేసవి సెలవులు ఉంటాయి. ఏప్రిల్ 25 నుంచి జూన్ 11వరకు వేసవి సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి నుంచే ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు రైళ్లలో సీట్లు రిజర్వేషన్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటికే సీట్లన్నీ రిజర్వ్ చేసుకోవడంతో బెర్తు దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో ఎన్నో కుటుంబాలు పలు ప్రాంతాలకు వెళ్లలేకపోతున్నాయి. మరోవైపు ఎలక్షన్లు కూడా ఉండటంతో.. రెండు నెలల ముందు నుంచే రైల్వే సీట్లన్నీ రిజర్వ్ అయిపోయాయి. దీంతో సెలవులు అయిపోయే వరకు ఇదే పరిస్థితి ఉంటుందని, అత్యవసర పనులపై వెళ్లాలంటే ఎలా? అని తలలు పట్టుకుంటున్నారు.
మూడు నెలల ముందే..
కాగా రైల్వే రిజర్వేషన్లకు 4 నెలల ముందే వెసులుబాటు కల్పించారు. దీంతో ప్లానింగ్ ఉన్నవారు ముందుగానే రిజర్వేషన్ చేసుకుంటున్నారు. ఒకట్రెండు రోజుల్లోనే టికెట్లు అయిపోతున్నాయి. తర్వాత అత్యవసరంగా వెళ్లే వారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. బస్సుల్లో వెళ్దామనుకుంటే స్లీపర్, ఏసీ బస్సులు కొన్ని మాత్రమే ఉండడంతో అక్కడ టికెట్ల ధరలను అమాంతం పెంచేస్తున్నారు. వేసవి సెలవులకు ప్రత్యేక రైళ్లను నడిపే పరిస్థితి లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
ప్రత్యేక రైళ్లు ఎప్పటికి వస్తాయో..?
సాధారణంగా సెలవుల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వారి సంఖ్యకు అనుగుణంగా రైళ్లు పెరగడంలేదు. అదనంగా మరో 10 రైళ్లు నడిపితే గానీ సీటు దొరికే పరిస్థితి నెలకొంది. ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి చొప్పున వందేభారత్ ఉన్నాయి. అయితే అందులో 1120 సీట్లు మాత్రమే ఉండటంతో రిజర్వేషన్ తెరవగానే హాట్ కేకుల్లా అయిపోతున్నాయి. ఈస్టు కోస్టు, గోదావరి, గరీబ్‌రథ్, కోణార్క్, ఫలక్‌నుమా, విశాఖ, విశాఖ – మహబూబ్‌నగర్ వంటి తదితర ఎక్స్‌ప్రెస్ రైళ్లు సరిపోవడంలేదు. మరోవైపు మే 13న ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో మే 9 నుంచి 12 వరకు రైళ్లు సీట్లన్నీ రిజర్వ్ చేసుకోవడంతో ఒక్క సీటు అందుబాటులోలేని పరిస్థితి నెలకొంది.