ప్రజాస్వామ్యాన్ని కాపాడండి… CM కేజ్రీవాల్ అరెస్ట్‌పై విపక్షాల పోరుబాట… ఢిల్లీ వేదికగా…
ప్రజాస్వామ్యాన్ని కాపాడండి నినాదంతో విపక్ష ఇండియా కూటమి ఢిల్లీలో భారీ ర్యాలీ తలపెట్టింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ , కాంగ్రెస్‌కు ఐటీ నోటీసులపై బీజేపీతో యుద్దానికి సిద్దమయ్యింది ఇండియా కూటమి. దీనిలో భాగంగా ఢిల్లీ రాంలీలా మైదానంలో ఇండియా కూటమి నేతలు మెగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీకి కూటమిలోని 29 పార్టీలూ ర్యాలీలో పాల్గొనబోతున్నాయి. ముఖ్యంగా కేజ్రీవాల్ అరెస్ట్ , కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాలను ఐటీ శాఖ ఫ్రీజ్ చేయడంపై ఇండియా కూటమి భారీ నిరసనకు రెడీ అయ్యింది. ఢిల్లీ రాంలీలా మైదానంలో ఇవాళ భారీ ర్యాలీని నిర్వహిస్తున్నారు. పన్ను ఎగవేత కేసులో రూ.1800 కోట్లు చెల్లించాలని ఐటీ శాఖ నోటీసులు ఇవ్వడంపై కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు.
ఢిల్లీలో జరిగే ర్యాలీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోసియా గాంధీ, రాహుల్‌గాంధీ సహా కీలకనేతల పాల్గొనబోతున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను మోదీ సర్కారు అడ్డంగా దుర్వినియోగం చేస్తోందని మండిపడుతున్నాయి విపక్షాలు. ఇవాళ్టి ర్యాలీలో ఇదే అంశాన్ని ప్రధానంగా జనంలోకి తీసుకెళ్లనున్నారు నేతలు. ఇవాళ్టి కార్యక్రమాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఢిల్లీ సీఎం కేజ్రివాల్ మద్యం కుంభకోణం కేసులో జైలుపాలైన నేపథ్యంలో ర్యాలీకి భారీ జనసమీకరణ చేసి సత్తా చాటాలన్న పట్టుదలతో ఉంది.
ర్యాలీకి తృణమూల్ కాంగ్రెస్ కూడా హాజరు
జరిగే ఇండియా కూటమి ర్యాలీకి తృణమూల్ కాంగ్రెస్ కూడా హాజరవుతుందని తెలిపారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ … ఈ సభకు లోక్‌సభ ఎన్నికలతో సంబంధం లేదని , బీజేపీ ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై పోరాటం కోసమే విపక్షాలు ఏకమవుతున్నట్టు తెలిపారు. విపక్ష నేతలను టార్గెట్ చేస్తున్న దర్యాప్తు సంస్థలకు బీజేపీకి అక్రమంగా అందిన ఎలక్ట్రోరల్ బాండ్స్ కన్పించడం లేదా అని ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల వేళ విపక్ష నేతలను అరెస్ట్ చేయడమే కేంద్ర దర్యాప్తు సంస్థలు పనిగా పెట్టుకున్నాయని విమర్శించారు జైరాం రమేశ్..