నాడు కానిస్టేబుల్…. నేడు బాస్…
గతంలో చిరు ఉద్యోగిగా ఉన్న వ్యక్తి నేడు దేశ అత్యున్నత సివిల్ సర్వీసెస్‌లో ప్రతిభ చాటాడు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సివిల్ సర్వీసెస్-2023 లో ఉత్తమ ర్యాంకు సాధించిన ఎం.ఉదయ్ కృష్ణా రెడ్డి గతంలో సాధారణ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించాడు.
కానీ పట్టుదలతో నేడు ఈ స్థాయికి చేరుకున్నాడు. సివిల్ సర్వీసెస్ ఆల్ ఇండియా ఫలితాల్లో 780వ ర్యాంకు సాధించిన ఉదయ్ కృష్ణా రెడ్డిది సింగరాయకొండ మండలం ఊళ్ళపాలెం గ్రామం. ఈ సందర్భంగా ఎస్పీ గరుడ్ సుమిత్ సునిల్ స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలోని తన చాంబర్లో ఉదయ్ కృష్ణా రెడ్డిని సన్మానించారు. ఎస్పీ మాట్లాడుతూ నేటి యువత ఉదయ్ కృష్ణా రెడ్డిని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.
తాను 2013 నుంచి 2018 వరకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గుడ్లూరు పోలీస్ స్టేషన్, రామాయపట్నం మైరెన్ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించానన్నారు. ఐఏఎస్ సాధించిన రేవు ముత్యాల రాజును స్పూర్తిగా తీసుకొని సివిల్స్‌కు సిద్ధమయ్యానన్నారు. అందుకోసం 2018లో కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి పట్టుదలతో చదివానన్నారు. తన చిన్నప్పుడే తల్లి దండ్రులు చనిపోయారని, నాయనమ్మ రమణమ్మ తనను తీర్చిదిద్దారని చెప్పారు.