మహిళపై అమాంశానికి పాల్పడింది సంగారెడ్డి యువకులు

మూసాపేట :

మహిళపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడి ఆమె మృతికి కారణమైన కేసులో పోలీసులు నిందితులను గుర్తించినట్లు తెలిసింది. కూకట్‌పల్లి వైజంక్షన్‌లోని ఓ భవనం సెల్లారులోని షట్టరు ముందు ఆదివారం తెల్లవారుజామున చిత్తు కాగితాలు ఏరుకునే గుర్తు తెలియని మహిళ(45)పై ఇద్దరు యువకులు అత్యాచారం చేసి పరారైన ఘటన తెలిసిందే.

రక్తస్రావంతో బాధితురాలు ఘటనా స్థలంలోనే మృతిచెందింది. ఈ అమానుషానికి పాల్పడిన యువకులు సంగారెడ్డికి చెందిన వారుగా విచారణలో తేలింది. సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితులు ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని గుర్తించి దర్యాప్తు చేపట్టడంతో ఆచూకీ లభించింది. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా.. ఆ యువకులు సంగారెడ్డిలోనే ఉన్న ఓ బార్‌లో పనిచేస్తారని తేలింది.

బార్‌లో అర్ధరాత్రి వరకు పనిచేసిన వారు బాగా మద్యం తాగి ద్విచక్ర వాహనంపై వైజంక్షన్‌ ప్రాంతానికి వచ్చారు.

ఆ సమయంలో అటుగా నడుచుకుంటూ వచ్చిన బాధితురాలిపై దారుణానికి ఒడిగట్టారు. ఆమె మూసాపేటలో ఉండేదని, ఆరు నెలల క్రితం వరకు ఓ వాహన షోరూంలో స్వీపర్‌గా పని చేసేదని తెలిసింది. అక్కడ సిబ్బందిని విచారించినా ఆమె చిరునామా తెలియలేదు.