ఏది నిజం…? ఏది అబద్ధం…?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత కొంతకాలంగా తన బహిరంగ సభల్లో లేదా మీడియా మీట్ లో ఒకటే మాట అంటున్నారు! తనపై కుట్ర జరుగుతున్నదని, తన నాయకత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రకు తెర లేపారని ఆరోపిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి, బిఆర్ఎస్ చేతులు కలిపి లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాయని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా మహబూబ్ నగర్ తో పాటు మరో ఐదు నియజకవర్గాల్లో తప్పనిసరిగా కాంగ్రెస్ అభ్యర్థులను ఓడిస్తే, అ ప్రభావం రేవంత్ రెడ్డి పై పడుతుందని, ముఖ్యమంత్రిని హై కమాండ్ మార్చే పరిస్థితి వస్తుందని, తరువాత రేవంత్ రెడ్డి బీజేపీ లో చేరిపోతారని ఇలా అనేక వాదనలు చెలరేగి పోతున్నాయి!
మొదట్లో కొన్నాళ్ళు ముఖ్యమంత్రి మాటలు విని వినీ కొంచెం విసుగు వచ్చిన మాట నిజమే! ప్రభుత్వం కూల్చేస్తారని పదే పదే ప్రజలకు చెప్పి ప్రయోజనం లేదు! ఎలాగూ ఒకవేళ కూలిస్తే ప్రజలు అప్పుడు చూసుకుంటారు! ప్రజా పాలన తెచ్చుకుంది ఎవరో కుట్ర చేసి కూలిస్తే చూస్తూ వుండరుగా!
ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మిగిలిన సీనియర్ నేతలు, మంత్రులు ఐకమత్యంగా పని చేస్తున్నారు. వంద రోజుల పాలన ప్రజామోదయోగ్యంగా పరుగులు తీసింది! ఆరు గ్యారంటీలలో ఐదు గ్యారంటీలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి! ఆరో గ్యారంటీ ఆగస్టు 15 లోపు చేసి తీరుతామని హామీ ఇచ్చారు!
అసలు వీటన్నిటికన్నా ఈ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి మరో తీవ్రమైన బాంబ్ బ్లాస్ట్ చేశారు. బిజెపి ప్రభుత్వం వస్తే రిజర్వేషన్స్ తొలగిస్తుందని, ఇది ఆర్ఎస్ఎస్ ఎజెండా అని, అందుకే 2021లో జరగాల్సిన జనాభా గణన జరగకుండా తొక్కి పట్టారని, ఇందుకు సాక్ష్యాలు సైతం తన దగ్గర ఉన్నాయని ఆయన అంటున్నారు. దీనికి సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నుంచి కొన్ని వీడియోలు లీక్ అయ్యాయి. ఆ వీడియోలు మార్ఫింగ్ చేసినవని ఫిర్యాదు చేయించి ఢిల్లీ పోలీసులతో రేవంత్ రెడ్డి పై కేసు నమోదు చేయించి సమన్లు జారీ చేయించారు బిజెపి పెద్దలు!
నిజానికి బిజెపి కేంద్రంలో మళ్ళీ వస్తే రిజర్వేషన్లు తొలగిస్తుందా? మోదీ సైతం భయంకరంగా ఆధారాలు లేకుండా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆస్తులు లాక్కుంటారని ఆరోపిస్తున్నారు! ఇలా ఒక పార్టీపై మరో పార్టీ ఇంత దారుణంగా జనాలను భయపెట్టేలా విమర్శలు చేయడం ఎంత వరకు సబబు? మత విద్వేషాలతో రెచ్చగొట్టడం ప్రజాస్వామ్య దేశంలో తగునా? గతంలో ఎప్పుడు ఇంత దారుణ స్థితిలో ఎన్నికల పోరు జరగలేదనేది వాస్తవం!