బీజేపీ, కాంగ్రెస్ ఫేక్ ప్రచారాలు చేయడం సిగ్గుచేటు
ఆరు గ్యారెంటీలు అమలైన గ్రామాల్లో మేము ఓట్లు అడగం దమ్ముంటే కాంగ్రెస్ ముందుకురావాలి నర్సాపూర్ ప్రెస్మీట్లో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు..
నర్సాపూర్ :
సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలను రద్దుచేస్తే ఊరుకోమని కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు హెచ్చరించారు. సోమవారం మెదక్ జిల్లా నర్సాపూర్‌లో స్థానిక ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను కేసీఆర్ ఏర్పాటు చేస్తే, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాలను రద్దు చేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జిల్లాల రద్దును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీజేపీలు బీఆర్ఎస్పై అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బీఆర్ఎస్ అభ్యర్థిపై సోషల్ మీడియాలో గ్లోబెల్స్ ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. బీఆర్ఎస్ అభ్యర్థిపై తప్పుడు వీడియోలు సృష్టించిన బీజేపీ యువ మోర్చా నాయకులపై పటాన్చెరు పోలీస్‌స్టేషన్‌లో ఇప్పటికే కేసు నమోదు అయ్యిందన్నారు.
హామీలు చేతగాక సెంటిమెంట్ రగిల్చి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నాయని కాంగ్రె స్, బీజేపీలను ఆయన విమర్శించారు. ఓవైపు ఎండలు మండుతుంటే, మరోవైపు కాంగ్రెస్, బీజేపీ మోసపూరిత మాటలతో ప్రజల గుండెలు మండుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం రెండు వేవ్‌లు నడుస్తున్నాయని, ఒకటి హీట్ వేవ్ కాగా.. మరోటి బీఆర్ఎస్ వేవ్ అని హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ విజయం ఖాయమైపోయిందన్నారు. మెదక్ జిల్లా కీర్తిని ఆకాశానికి ఎత్తి చాటిన కేసీఆర్‌ను తిట్టడం సరికాదన్నారు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ అశోక్‌గౌడ్, జడ్పీ కోఆప్షన్ మెంబర్ మన్సూర్, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, నాయకులు గోపి, సత్యంగౌడ్, వెంకట్‌రెడ్డి, శివకుమార్, భిక్షపతి పాల్గొన్నారు.