ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు వేతనం ఖరారు
ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు, అధికారులకు ఎన్నికల సంఘం వేతనాలు ఖరారు చేసింది. శిక్షణలతో పాటు పోలింగ్ రెండు రోజులు కలిపి వేతనం అందిస్తారు. అలాగే భోజనం ఖర్చులను అదనంగా ఇస్తున్నారు. ఓట్ల లెక్కింపులో పాల్గొనే వారికి అదనం.
ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు మూడు రోజుల శిక్షణతో పాటు రెండు రోజుల పోలింగ్ దినాలు కలిపి మొత్తం ఐదు రోజులకు గాను రోజుకు రూ.600 చొప్పున ఒక్కొక్కరికి రూ.3 వేలు చెల్లిస్తారు.
అదనపు పోలింగ్ అధికారికి రెండు రోజుల శిక్షణతో పాటు రెండు రోజుల పోలింగ్ దినాలు కలిపి నాలుగు రోజులకు గాను రోజుకు రూ.400 చొప్పున రూ.1600 చెల్లిస్తారు.
సూక్ష్మ పరిశీలకుడికి (మైక్రో ఆబ్జర్వర్) రూ.2 వేలు, ఓటరు ఫెసిలిటీస్ సెంటర్ ఇన్ఛార్జికి రెండు రోజులకు గాను రూ.600 చెల్లించారు.
పోలింగ్ స్టేషన్లో అల్పాహారం, భోజనానికి…
ఎన్నికల ప్రక్రియ జరిగే ఈ నెల 12, 13 తేదీల్లో పోలింగ్ స్టేషన్లో ఒక్కొకరికి రెండు రోజులకుగాను అల్పాహారం, భోజనానికి రూ.250, తాగునీటికి రూ.20 చొప్పున చెల్లిస్తారు. అలాగే ఒక్కో పోలింగ్ స్టేషన్లో ఎన్నికల ఏర్పాట్ల కోసం పది మంది సిబ్బందికి రూ.4 వేలు నిధులను కేటాయించారు.